Trishul News

రాష్ట్రపతి దృష్టికి వాల్మీకి బోయల సమస్యలను తీసుకువెళ్లిన ఏపీవీబీఎస్..!

- ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ కులస్తుల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్రపతి హామీ
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూని డిల్లీలోనీ రాష్ట్ర పతి భవనంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నాయకులు కలసి వాల్మీకి సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 70 ఏళ్ళ స్వాతంత్ర్య భారత దేశంలో వాల్మీకి బోయలు ఎదుర్కుంటున్న సమస్యలు, ఎస్టీ హోదా కోసం చేస్తున్న పోరాటాలు, మూడువేల కిలోమీటర్లకు పైగా చేసిన వాల్మీకి మేలుకొలుపు యాత్రలో తెలుసుకున్న విషయాలను వివరించారు. మరియు వలసలు, బోయల దుర్బర పరిస్ధితులు, జైళ్ల పాలు, బోయలపై ఉన్న కేసులు, రౌడీ షీటర్ పేరుతో అరాచకాలు, బోయ వాడల దయనీయ దుస్తితులను తెలియజేసారు.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలా వెనకబడ్డారు, ఒక్క అభివృద్ది పథకం కూడా లేకపోవడం, వృత్తి లేని కారుణంగా లోన్ లు ఇవ్వకుండా బ్యాంక్ లు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు, చదువులో ఎలా వెనకబడ్డారు, ఒక్క స్టడీ సెంటర్ లేని దయనీయ స్థితిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల, రైతుల, కార్మికుల సమస్యలు, ప్రాంతీయ వ్యత్యాసాలు, స్పెషల్ ఏజెన్సీ అంశాలు, కేంద్ర ప్రభుత్వం చూపుతున్న మోండి వైఖరి, ఆర్జిఐ ఇచ్చిన ఆధారాలు లేని రిపోర్ట్ లు వాటికి సమాధానాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల ఫైల్ చేసిన ఆర్టీఐలకు సమాధానాలు లేక మా దగ్గర మీ డేటా లేదు అన్న అంశాలు, వారు ఇచ్చిన అఫిడవిట్ లు, దేశంలో వాల్మీకులు
ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎస్టీ హోదా కల్పించారని, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అంశాలు, ఎరుకలు, లంబాడీలను చేర్చి ఎలా బోయలను ఎస్టీ హోదా తొలగించారో, రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిన సంఘటనలు, 1976 లో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘన విషయం ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన 
మంత్రి మోదీ కర్నూలు సభలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్ లు, వారి రిపోర్ట్ ల గురించి, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు గురించి ఇలా దాదాపుగా 30 నిమిషాలు జరిగిన సమావేశంలో అన్నీ క్లుప్తంగా వివరించారు. ఈ సందర్బంగా ఒక సుదీర్ఘ రిపోర్ట్ ను రాష్ట్రపతికి అందజేశారు. రాజ్యాంగ నిర్మిత భారత దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు అయిన మీరు రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన అంశాలను సవరణ చేసి పరిష్కరించాలిని కోరారు. అన్నిటికీ సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి త్వరలో ఈ అంశంపై తప్పక కార్యాచరణ చేపడుతాను అని, ప్రధాన మంత్రితో, హోమ్ మినిస్టర్ తో, కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ తో, సోషల్ జస్టిస్ మినిస్ట్రీ తో చర్చించి మీకు న్యాయ్యం చేస్తానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. రాష్ట్రపతిని కలసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్) గౌరవ అధ్యక్షులు హనుమంతు నాయుడు, భ్రమరాంబ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ క్రాంతి నాయుడు, కర్నూలు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్, కుప్పం వాల్మీకి నాయకులు బాబు నాయుడు మరియు ఎల్లార్తి మహేష్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post