చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ మృతి..!
చత్తీస్గఢ్, త్రిశూల్ న్యూస్ :
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ మరణించారు. బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ బీజాపూర్ డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తి, సుమిత్రతో పాటు సుమారు 40 మంది మావోలు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించాయి. మావోలు ఉన్న ప్రాంతం సమీపానికి వెళ్లిన పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా ఎదురుకాల్పులు కొనసాగాయి. ఆ తరువాత ఆ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కనిపించాయని పోలీసులు వివరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఆ నలుగురు మావోలు మృతిచెందారు. మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్లు తెలిపారు. మావోల సమాచారం రాగానే, టీమ్ లుగా ఏర్పడి, తెల్లవారు జాము నుంచే గాలింపు చేపట్టామని, అనంతరం ఉదయం 7.30గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 303, 315 రైఫిళ్లతో పాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8 వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగానే మావోయిలు అక్కడ సమావేశమైనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా పూర్తవలేదని గాలింపు కొనసాగిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
Comments
Post a Comment