కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి రోజా..!
నగరి, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. కూతకు వెళ్లిన మంత్రి రోజాను అమ్మాయిల జట్టు టాకిల్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె వెళ్లకిలా కిందపడిపోయారు. ఆమెపై విద్యార్థులు పడిపోయారు. దీంతో అందరూ కంగారుపడ్డారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారుపడాల్సిన అవసరం లేదని రోజా వారికి సర్దిచెప్పారు. కాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నామని.. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీమ్ ను పంపిస్తారని, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు.. జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు డిసెంబర్ 21న విజేతలకు అవార్డులు అందిస్తామని వివరించారు.
Comments
Post a Comment