మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు - బాబా రాందేవ్
ముంబై, త్రిశూల్ న్యూస్ :
యోగా గురు బాబా రాందేవ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకున్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో క్షమాపణ చెప్పారు. మహారాష్ట్రలోని థానేలో ఏర్పాటు చేసిన యోగా క్యాంప్‌లో ఆదివారం నాడు మాట్లాడిన బాబా రాందేవ్ మహిళల వస్త్రధారణపై సరదా వ్యాఖ్యలు చేయాలని భావించి అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. మహిళలు చీరలో, సల్వార్ సూట్స్‌లో చూడ చక్కగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో వివాదం ఏం లేనప్పటికీ ఆపై చేసిన వ్యాఖ్య పెను దుమారం రేపింది. మహిళలు ఏం ధరించకపోయినా కూడా బాగుంటారని బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. నెటిజన్లు కూడా రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ కాపీని మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి చకంకర్ ట్వీట్ చేశారు. బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆయన చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమె ట్వీట్ చేశారు. రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఖండించారు. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భార్య ముందే రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయమని, ఈ వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా బాధించాయని.. బాబా రాందేవ్ క్షమాపణ చెప్పాలని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న అమృత ఫడ్నవీస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో బాబా రాందేవ్ క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం, సమాజంలో మహిళలు గౌరవప్రదంగా వెలుగొందడం కోసం ఎల్లప్పుడూ శ్రమించే వ్యక్తినని బాబా రాందేవ్ చెప్పుకొచ్చారు. తనకు మహిళలను కించపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అసందర్భమైందని వివరణ ఇచ్చారు. ఇప్పటికీ ఎవరినైనా తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమాపణ చెబుతున్నానని బాబా రాందేవ్ చెప్పారు.
Comments
Post a Comment