ఓటరు నమోదుపై అవగాహన పెంచండి - కమిషనర్ హరిత
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలెక్టోరల్ రోల్స్ 2023 లో భాగంగా ఏర్పాటు చేసిన కాంపెయిన్ ల ద్వారా అర్హులైన వారిని నూతన ఓటర్లుగా నమోదు చేయించాలని కమిషనర్ హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం, తహశీల్దార్ లతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర జనాభాతో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. అర్హులైన ఓటర్ల సంఖ్యను పెంచేందుకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి నూతన ఓటర్ల నుంచి ఫారం 6,7,8 క్లెయిమ్ లను సేకరిస్తారని తెలిపారు. 09-11-22న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును బూత్ లెవెల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంచామని, ఓటర్లు పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్ సూచించారు. నూతన ఓటరు నమోదు, ఓటరు వివరాల మార్పు చేర్పులకై అవసరమైన అన్ని ఫారములు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఓటర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్, ల్యాండ్ అక్విజేషన్ తహశీల్దార్, ఇంచార్జ్ డి.సి.పి, అర్బన్ డిప్యూటీ తహశీల్దార్, నగర పాలక సంస్థ ఎలక్షన్ విభాగం పాల్గొన్నారు.
Comments
Post a Comment