భూముల రీ సర్వేపై విమర్శలేంటి..ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు..?

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల విషయంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టింది. భూముల రీ సర్వే, రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేస్తామని సర్కారు అంటోంది. 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. తొలివిడత 2వేల గ్రామాలలో ఈ ప్రక్రియ పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా గ్రామాల్లో భూ యజమానులకు హక్కు పత్రాల పంపిణీ కూడా ప్రారంభించారు. మరో ఐదు విడతల్లో వచ్చే ఏడాది డిసెంబర్ ఆఖరికి అన్ని గ్రామాల్లోనూ ఈ రీ సర్వే పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల జరిగే మార్పులేంటి, సర్వే నిర్వహించిన చోట ఏం జరుగుతోంది, కొత్త విధానం ద్వారా కలిగే ప్రయోజాలేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం ఏం చెబుతోంది...
దేశంలో భూమి రికార్డులను వందేళ్ల క్రితం ఆధునికీకరించారు. 1923-24 సంవత్సరాల్లో భూములను కొలిచి ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్ (ఎఫ్ఎంబి) పేరుతో నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా నేటికీ దాని ఆధారంగానే సర్వే నెంబర్లున్నాయి. బ్రిటిష్ హయంలో పాతిన సర్వే రాళ్ల కేంద్రంగానే నేటికీ భూములను కొలుస్తుంటారు. ఈ వందేళ్ల కాలంలో భూముల యాజమానులు మారినా, ఆయా భూముల పంపకాల మూలంగా భాగాలుగా చేసినా సర్వే నెంబర్లు మాత్రం అవే కొనసాగుతున్నాయి. వందేళ్ల నాటి ఎఫ్ఎంబీ ఆధారంగా భూముల సర్వేల నిర్వహణ చాలా సమస్య అవుతోంది. అదే సమయంలో భూ రికార్డుల విషయంలో సమగ్రత లేకపోవడం వల్ల అనేక వివాదాలు జరుగుతున్నాయి. తప్పుడు రికార్డుల ఆధారంగా భూ రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోవడం పెద్ద సమస్య అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రికార్డులు సమగ్రంగా ప్రక్షాళన చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆలోచన చేసింది. ఏపీ ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో జరుగుతున్న భూముల రీ సర్వే, రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పట్ల సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వీ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో కచ్చితత్వం పాటించేందుకు అనగుణంగా మ్యాప్‌లు రూపొందించడం దేశంలోనే తొలిసారిగా జరుగుతోందని శ్రీకాకుళంలో జరిగిన సభలో ప్రస్తావించారు. ఈ మోడల్‌ను దేశమంతా అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని కూడా పేర్కొన్నారు.
సర్వేలో ఏం చేస్తున్నారు..
రాష్ట్రంలో ఈ భూముల రీ సర్వే కోసం 2020 ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుత నాటి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని సర్వే చేసింది. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆచరణలో అనేక సమస్యలు ఎదురుకావడంతో 2022 నవంబర్ 23 నాటికి 2వేల గ్రామాలు పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.31 కోట్ల ఎకరాల భూములను రీ సర్వే చేయాల్సి ఉండగా 4.31 లక్షల సబ్ డివిజన్లలో పూర్తి చేశారు. 7,92,238 మంది రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి హక్కు పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సర్వే కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు వెచ్చిస్తోంది. 4500 సర్వే బృందాలు ఏర్పాటు చేసింది. డ్రోన్లతో సర్వే చేపడుతోంది. హెలికాప్టర్లు కూడా వినియోగిస్తున్నట్టు చెబుతోంది. ఈ భూముల సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 70 కార్స్ బేస్ స్టేషన్లు (కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) ఏర్పాటు చేసింది. శాటిలైట్‌తో లింక్ అయి అవి పనిచేస్తుంటాయని ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా భూముల రికార్డుల్లో 10 సెం.మీ.ల లోపు మాత్రమే తేడా ఉంటుందని, అంత కచ్చితత్వానికి అవకాశం ఉంటుందని అంటోంది. ప్రతీ భూకమతాన్ని అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ చేసి ప్రతీ భూమికి ఓ నెంబర్ కేటాయిస్తున్నారు. సదరు భూమి వివరాలు తెలిసేలా ఓ క్యూర్ కోడ్ రూపొందిస్తున్నారు. ఫిజికల్‌గానే కాకుండా డిజిటల్ గానూ ఈ రికార్డులన్నీ నమోదు చేస్తుండడం వల్ల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సర్వే విభాగం చెబుతోంది.
రైతులు ఏమంటున్నారు...
జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో తొలుత ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఆ గ్రామానికి చెందిన ఆర్ కామేశ్వరమ్మ అనే రైతు మాట్లాడుతూ.. "మా నాన్న సంపాదించిన భూమి ఎకరం 5 సెంట్లు. ఆయన తర్వాత మా ఆయన సాగు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు పెళ్లిళ్లయ్యి అత్తారింటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నేనే ఆ భూమి సాగుచేస్తున్నాను. వరి పండిస్తాను. కానీ భూమి మాత్రం పెద్ద కూతురికి ఇచ్చాము. రికార్డుల్లో మా ఆయన పేరుతోనే ఉంది. మా భూమి హద్దులు కూడా ఏమిటన్నది మాకు పూర్తిగా తెలియదు. సర్వే వాళ్లు వచ్చి రాళ్లు పాతారు. డ్రోన్‌తో ఫోటోలు తీశారు. మాకు ఓ హక్కు పత్రం కూడా ఇచ్చారు. ఇకపై అదే పట్టాగా ఉంటుందన్నారు. నా కూతురి పేరుతో ఇప్పుడు రికార్డు వచ్చింది. ఇకపై ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా అన్నీ కూడా భూ యజమానిగా నా కూతురికే వస్తాయని చెప్పారు"అంటూ ఆమె వివరించారు. సాధారణంగా భూములను వారసులకు బదలాయించాలంటే రిజిస్ట్రేషన్ చేయించాలి. వాటాలు పంచుకున్నా మ్యుటేషన్ ప్రక్రియలో అంతా రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దానికి నిర్దిష్ట మొత్తాలు చెల్లించి ఈ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కామేశ్వరమ్మ వంటి వారు అలాంటివి లేకుండానే రికార్డుల్లో ఎవరి పేరు ఉన్నా, తామే సాగు చేసుకుంటున్నామనే ధీమాతో వ్యవహరిస్తున్న తీరుకి ఈ సర్వే తర్వాత పరిష్కారం దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. జగ్గయ్యపేట మండలంలో భూయజమానుల అనుభవం కూడా అదే చాటుతోంది.
పాసుబుక్ అవసరం తీరినట్టే...
ప్రస్తుతం సర్వే చేసిన గ్రామాల్లో ప్రభుత్వం భూహక్కు పత్రాలు రైతులకు అందిస్తోంది. ప్రతీ భూకమతానికి భూరక్ష హద్దు రాళ్లు వేయడంతో పాటుగా రికార్డులన్నీ పగడ్బందీగా రూపొందించిన మూలంగా భూ వివాదాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 80 శాతం వరకూ కోర్టు వివాదాలు కూడా సివిల్ అంశాల చుట్టూ ఉన్న తరుణంలో భవిష్యత్తులో అనేక వివాదాలకు ఈ సర్వే పరిష్కారం అవుతుందని ఆశిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రోవర్లు ఉపయోగించి చేస్తున్న ఈ ప్రక్రియ ద్వారా ఇచ్చే భూహక్కు పత్రాలకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. "నకిలీ పాసుబుక్‌లో, తప్పుడు రికార్డులతో బ్యాంకులను కూడా మోసం చేసే ముఠాలు తయారయ్యాయి. ఇకపై అలాంటి వాటికి అవకాశం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇది జరుగుతోంది. కోటి 7లక్షల మంది భూయజమానులకు హక్కు పత్రాలు అందిస్తాము. 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములతో పాటుగా 1. 2 కోట్ల ఎకరాల నివాస ప్రాంతాల రికార్డులు ఆధునికీకరిస్తాము. ఆధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగించి ఈ ప్రక్రియ సాగుతోంది. ఆస్ట్రేలియా సహా భూ రికార్డుల్లో ఉన్నత ప్రమాణాలు పాటించే దేశాల్లో వినియోగిస్తున్న టెక్నాలజీని పరిశీలించి ఏపీలో అమలు చేస్తున్నాము. ఇకపై మ్యుటేషన్లు సహా ఎటువంటి సమస్యనయినా వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది" అంటూ ఆయన వివరించారు. 1923 నాటి ఎస్‌అండ్‌బి యాక్ట్ మూలంగా ప్రస్తుతం ఎవరైనా భూమి సర్వే చేయాలంటే రోజుల సమయం పడుతోందని, ఇకపై అరగంటలో భూ సర్వే పూర్తయ్యేందుకు అనుగుణంగా ఈ మార్పులు వస్తున్నాయని మంత్రి ధర్మాన వివరించారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజలందరికీ మరికొన్ని తరాల పాటు ఉపయోగపడే కార్యక్రమంగా ఆయన చెప్పారు. పట్టాదార్ పాసుపుస్తకాల కోసం అధికారుల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా భూయజమానులందరికీ అందించే ప్రక్రియ ఓ చరిత్ర అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపై భూహక్కు పత్రాలే అన్నింటికీ మూలంగా మారబోతున్నట్టు ధర్మాన వివరించారు.
రైతుల సహకారంతోనే...
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో సగటున 50 శాతం మంది రైతులు మాత్రమే భూములున్న ప్రాంతాల్లో నివశిస్తున్నారు. వివిధ అవసరాల రీత్యా దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సగం మంది ఉన్నారు. ప్రస్తుతం సమగ్ర సర్వే సందర్భంగా ఆయా భూ యజమానులు అందుబాటులో ఉంటే అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. "భూ రికార్డుల్లో ఉన్న దానికి వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి అత్యధిక సందర్భాల్లో పొంతన ఉండదు. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. ఈ సర్వే సమయంలో రైతుల నుంచి క్లయిమ్స్ లేకపోతే సాగులో ఉన్న భూమి మీద హక్కు కల్పిస్తున్నాం. అదనంగా ఉన్నప్పటికీ సరిహద్దు రైతులెవరూ దానిని తమదిగా చెప్పకపోతే రైతులకు శాశ్వత హక్కు వస్తుంది. దానివల్ల రైతులకు మేలు. వివాదం ఉంటే గడువులోగా పరిష్కరించి భూ సమస్యలకు చెక్ పెట్టేస్తున్నాం. కాబట్టి రైతులంతా దానిని ఉపయోగించుకోవాలి"అని అంటున్నారు ల్యాండ్ సర్వే విభాగం అధికారి జాషువా. ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో నియమించిన సర్వేయర్లు, ప్లానింగ్ సెక్రటరీలు కూడా 14వేల ముంది ఉండడం వల్ల సిబ్బంది కొరత కొంత వరకూ తీరిందని, సర్వే ప్రక్రియ వేగవంతంగా జరగడానికి అది దోహదపడుతోందని జాషువా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సెల్ ఫోన్లోనే ఎవరి భూమి ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు అనుగుణంగా రికార్డులు తయారవుతున్నాయని వివరించారు.

అనుమానాలు కూడా..?
భూహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రికార్డుల నమోదు ప్రక్రియ సజావుగా సాగలేదనే విమర్శలున్నాయి. పేర్లు, ఫోటోలు సక్రమంగా అప్‌లోడ్ కాకపోవడం వల్ల తప్పులు జరిగినట్టు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధికారులు గుర్తించారు. అనేక చోట్ల ఇలాంటివి జరిగినట్టు చెబుతున్నారు. పద్ధతి ప్రకారం భూమి హక్కులకు ఇచ్చే పథకాన్ని అమలు పరచడం చాలా మంచిదని, కానీ ఆచరణలో అలా జరగటం లేదని రైతు సంఘం నాయకులు అంటున్నారు. ''చివరగా పాసుబుక్కు చేతికి వచ్చిన తర్వాత మాత్రమే వారికి ఎంత భూమి రికార్డులో ఉందనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత తప్పులు వస్తే సవరించటానికి తహశీల్దార్, లేదా కలెక్టర్‌కు కూడా అధికారం లేదు. తప్పులను సవరించాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి మన భూమిని మనం రికార్డులకు ఎక్కించటానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. అందుకే తహశీల్దార్ కార్యాలయానికి ముందే వెళ్లి తమ భూమి రికార్డులను చూపించమని రైతులు అడగాలి. ముందే మేలుకొని తమ భూమిని కాపాడుకోవాలి''అని వారు అన్నారు. శాశ్వత భూమి హక్కు- భూ రక్షణ పథకం.. "మీ భూమి - మా హామీ"ని సరిగ్గా అమలయ్యేటట్లు చూడాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 1973ని మారుస్తూ తీసుకొస్తున్న మార్పుల పట్ల తెలుగుదేశం నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. "భూహక్కు పథకంను భూభక్ష పథకంగా మార్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను గుర్తించడమే ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశం. వాటిని అమ్ముకోవడం, లేదా తనఖా పెట్టాలనే కుట్ర ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూయజమానులకు మేలు చేసేలా విధానం ఉండాలి. కానీ అందుకు భిన్నంగా సాగుతోంది. భూరికార్డులు తారుమారు కాబోవంటూ చెబుతున్నప్పటికీ స్వయంగా రెవెన్యూ మంత్రి మీదనే మాజీ సైనికుల భూములకు సంబంధించిన వివాదం ఉంది. విశాఖలో భూములను ఏవిధంగా కబ్జా చేశారన్నది ఆధారాలు కూడా బయటపెట్టాం. అయినా చర్యలు శూన్యం. పైగా ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేసేందుకు ఈ విధానం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది" అంటూ టీడీపీ అధికార ప్రతినిధి కే పట్టాభి అన్నారు. ప్రభుత్వ భూములను పెద్దలు కాజేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని ఆయన అభివర్ణించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు