రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా - సుప్రీం

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్పులో మరికొన్ని అంశాలు జోడించాలని వాటికి కూడా న్యాయం చేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తొలుత వాదనలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలు ఉంచగా.. అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ''పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చగలదా? అలాంటి పరిస్థితి ఉందా? రాష్ట్ర విభజన చట్టంలో 'ఒక రాజధాని' అని మాత్రమే ఉంది. కానీ, పలు భాష్యాలు తీసుకోవాలని ఎక్కడా రాసి లేదు కదా? పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల ప్రకారం తీసుకున్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అమరావతిలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించారు. మరికొన్ని నిర్మాణాలు 70శాతం, 90శాతం చొప్పున పూర్తయ్యే దశలో ఉన్నాయి. వీటన్నింటికి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పుడు మార్చాలనుకుంటే వాటిని ఏం చేయాలి? అది ప్రజల సంపద కాదా? పెట్టుబడుల రూపంలో సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అది ఎలా సాధ్యమవుతుంది?భూ సమీకరణలో రైతులకు ఇచ్చిన హామీనిఎలా ఉల్లంఘిస్తారు?ప్రభుత్వ హామీ నమ్మి భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు? సీఆర్‌డీఏ చట్టం అమలు చేయకపోతే ప్రజల నమ్మకం వమ్ము చేసినట్లు కాదా?'' అని ధర్మాసనం ప్రశ్నించింది.

హైకోర్టు ఎక్కడుండాలని అనుకుంటున్నారు?
''రాష్ట్ర రాజధాని, హైకోర్టు ఎక్కడుండాలని అనుకుంటున్నారు? ఇప్పటికే అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టులో మౌలిక సదుపాయాలు ఇతరత్రా సేవలు కల్పించే పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో కర్నూలుకు హైకోర్టును ఎందుకు తరలించాలని అనుకుంటున్నారు? ఈ విషయంలో మీ ఉద్దేశమేంటి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో ఎక్కడా కేంద్రానికి సంబంధించిన ప్రస్తావన లేకుండా మీరే నిర్ణయాలు తీసుకోవడమేంటి?'' అని నిలదీసింది.

హైకోర్టు తప్పుబట్టినందునే సుప్రీంలో సవాల్‌ చేశాం..
''మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు కర్నూలు ప్రతిపాదన లేదు. హైకోర్టును ఎక్కడికి తరలిస్తున్నామనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వడం సాధ్యంకాదు. 3 రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం సమంజసం కాదు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మొత్తం తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రాన్ని, ఇతరులను సంప్రదించకుండా కేవలం అభివృద్ధి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నందున నిబంధనలతో కూడిన తీర్పు ఇవ్వడం సమంజసం కాదు. అమరావతిలోనే హైకోర్టు ఉండాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. రేపు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో ఇప్పుడే చెప్పలేం. అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తూ మిగతా విభాగాలను బదిలీ చేయాలనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి వేరే ఉద్దేశం లేదు. రాష్ట్ర హైకోర్టు దీన్ని కూడా తప్పుబట్టింది కాబట్టి సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తున్నాం. అందుకే స్టే ఇవ్వాలని కోరుతున్నాం'' రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.

ఏపీ హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది..
హైకోర్టు కాలపరిమితితో నిబంధనల విధింపుపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. ''హైకోర్టు టౌన్‌ ప్లానరా? హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా? అలా వ్యవహరిస్తే అక్కడ ప్రభుత్వం ఎందుకు?అభివృద్ధిని ఒక్కచోటే కేంద్రీకరిస్తే ఎలా?ఏపీ హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు