జగనన్న కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయండి - కమిషనర్ హరిత
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. స్థానిక 53 వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని జగనన్న కాలనీ లే అవుట్లను అధికారులతో కలిసి కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు లే అవుట్ల నిర్మాణ పనుల్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తూ, అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ విభాగం డి.ఈ, ఏ.ఈ, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment