టీఆర్‌ఎస్‌ పార్టీలో సర్వే గుబులు..!

- కష్టపడితే గెలిచేవి మరో ఐదుస్థానాలు

- ఆరు స్థానాల్లో ఎదురుగాలి
కరీంనగర్‌, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతోంది. ఇంత కాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు పోతారంటూ ప్రచారం జరుగగా, తాజాగా ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ అన్ని పార్టీల్లో అప్పుడే గుబులు మొదలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ దానిని నిలబెట్టు కోవడానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుంటున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గాల్లో పలు దఫాలుగా రాష్ట్ర పోలీస్‌శాఖలోని పలు విభాగాల ద్వారా అలాగే ప్రైవేట్‌ సర్వే సంస్థలతో పార్టీ పరిస్థితి, ప్రస్తుత ఎమ్మెల్యే పరిస్థితి, పార్టీకి ప్రజల్లో వస్తున్న సానుకూలత, పథకాలపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో అనే అంశాలతో సర్వే చేయిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ సర్వేలు నిర్వహించి చివరగా ఇటీవల జరిగిన సర్వేతో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. తాజా సర్వే నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాలు టీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలుస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కొంచెం కష్టపడితే మరో 30 నుంచి 35 స్థానాల్లో విజయం సాధించవచ్చని, 44 స్థానాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులున్నట్లుగా అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో..
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 13 నియోజకవర్గాల పరిస్థితి చర్చకు వచ్చి తాజా సర్వేలో ఏ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. మరి కొందరు రాజకీయ నాయకులైతే సర్వేల్లో టీఆర్‌ఎస్‌ ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశమున్నదని తేలిందంటూ చర్చను తెరపైకి తెస్తున్నారు. సర్వే రిపోర్టును టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించక పోయినా జిల్లాలో మాత్రం ఏ నియోజక వర్గంలో ఎవరు గెలువనున్నారు. ఏ పార్టీకి అవకాశాలున్నాయంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెరపైకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మంత్రులు గంగుల కమలాకర్‌, కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీకి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నియోజకవర్గమైన ధర్మపురిలో నువ్వానేనా అన్నట్లు కాంగ్రెస్‌ పోటీ ఇస్తున్న వాతావరణం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ కొంత కష్టపడితే గెలిచే అవకాశ ముందని, గత ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాలను గెలుపొందింది. మంథనిలో కాంగ్రెస్‌, రామగుండంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఫార్వర్డ్‌బ్లాక్‌ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా కొనసాగుతుండగా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన హుజూరాబాద్‌ శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ మార్పుల కారణంగా తాజాగా టీఆర్‌ఎస్‌ కు మళ్లీ 11 స్థానాలు మిగులగా మంథనిలో కాంగ్రెస్‌, హుజూరాబాద్‌ లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మంత్రులిద్దరి స్థానాల్లో గెలిచే అవకాశముండగా కొంచెం కష్టపడితే గెలిచే స్థానాల్లో ధర్మపురితోపాటు చొప్పదండి, మానకొండూర్‌, కోరుట్ల, హుస్నాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండబోతున్నారని తెలిసింది. మానకొండూర్‌, చొప్పదండి, ధర్మపురి ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టివేసిన బీజేపీ ఆ నియోజక వర్గాల్లో పోటీలోకి దింపే అభ్యర్థులను బట్టి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మంథని, హుజూరాబాద్‌, రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరి స్థితుల్లో ఉన్నదని, ఇక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపు అంత సులువేమి కాదని సర్వేల్లో తేలినట్లు సమాచారం. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్రీధర్‌ బాబు, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా నిలిచి మళ్లీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. రామగుండంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసి గెలిచిన కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి, జగిత్యాలలో డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, వేములవాడలో సీహెచ్‌ రమేశ్‌బాబు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ వివిధ కారణాలతో ప్రతికూలతను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పోటీ ఎదుర్కోబోతోంది. రామగుండంలో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీపడాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ రెండు నుంచి ఐదు లేదా ఆరు స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తన శాసన సభ్యులకు అవసరమైన సూచనలు చేసి నిత్యం ప్రజల్లో ఉంటూ లోపాలను సరిచేసుకోవాలని, ప్రజలకు అవసరమైనవి చేస్తూ వారికి దగ్గర కావాలని సూచించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ శాసన సభ్యులు పర్యటనలను ఖరారుచేసుకొని నియోజకవర్గంలోనే ఎక్కువ రోజులు గడిపే విధంగా ప్లాన్‌ చేసుకుంటున్నారని సమాచారం.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు