వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా - పవన్ కళ్యాణ్
- వైకాపాను దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పను..నేనే చేస్తా - పవన్
మంగళగిరి, త్రిశూల్ న్యూస్ :
''వైకాపా రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? మా వాళ్లను బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండకూడదా? రాజకీయం మీరే చేయాలా?మేం చేయలేమా? చేసి చూపిస్తాం.. ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం'' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని.. మాకు ఓట్లు వేసినా, వేయకపోయినా అండగా ఉంటానని చెప్పారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో ఆయన సమావేశమయ్యారు. బాధితులకు రూ.లక్ష చొప్పున పవన్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాది రౌడీసేన కాదు.. విప్లవసేన..!
యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. తమది రౌడీ సేన కాదని.. విప్లవసేన అని వ్యాఖ్యానించారు. ఇంతగా అభిమాన బలం ఉన్న నన్నే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటంలో గ్రామస్థుల గడపలు కూల్చడాన్ని తాను మర్చిపోనన్నారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని చెప్పారు. దేశం, రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థే లక్ష్యమని.. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దానికోసం పోరాడతానన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడనని చెప్పారు.
వికృతభావం లేకుంటే వాళ్లతోనే ఎందుకు తిట్టిస్తారు?
''కులాలను ఎప్పుడూ నేను ద్వేషించను. నేనెప్పుడు మాట్లాడినా నా కులంలో పుట్టిన నేతలతో తిట్టిస్తారు. ఎలాంటి వికృతభావం లేకపోతే వాళ్లతోనే ఎందుకు తిట్టిస్తారు? విభజించి పాలిచిన బ్రిటిష్‌వారు దేశం నుంచి వెళ్లిపోయినా ఆ గుణగణాలు వీరిలో ఉన్నాయి. ఆ పరిస్థితి మారాలి. కులాలన్నీ దేహీ అనే ధోరణి నుంచి బయటకు రావాలి.
నా యుద్ధం నేనే చేస్తా..
2014 తర్వాత ప్రధానిని మూడు, నాలుగు సందర్భాల్లో కలిశాను. నేనేం మాట్లాడానో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల అడుగుతున్నారు. నా దగ్గరకు రండి.. మీ చెవిలో చెప్తా. నేనెప్పుడు మాట్లాడినా దేశభద్రత, సగటు మనిషి రక్షణే కోరుకుంటా. నేను మీలా దిల్లీ వెళ్లి చాడీలు చెప్పను. వైకాపాను దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయను.. నేనే చేస్తా. ఇది నా నేల.. ఈ నేలలోనే పుట్టినోడిని.. ఆంధ్రుడిని.. ఆంధ్రలోనే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే దిల్లీ వెళ్లి అడగను. మేమే తేల్చుకుంటాం. అధికారం లేనోడిని.. నామీద పడి ఏడుస్తారేంటి? ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరు ఎలా గెలుస్తారో చూస్తా'' అని పవన్ వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment