ప్లాస్టిక్ కవర్ల నిషేధం కఠినంగా అమలు చేయాలి - కమిషనర్ హరిత
- పందుల నిర్మూలనకై ప్రత్యేక డ్రైవ్
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగరంలో సమస్యాత్మకంగా మారిన పందుల బెడదను నివారించడానికి ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని, జనావాసాల మధ్య వాటి సంచారాన్ని పూర్తిగా అరికట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ముందుగా డయల్ యువర్ కమిషనర్ ద్వారా 12 ఫిర్యాదులను అందుకున్నారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు సంబంధిత విభాగాలకు బదిలీ చేశారు. డస్ట్ బిన్ ల నిర్మూలనతో అన్ని డివిజనుల్లో పశువులు, కుక్కలు, పందులకు ఆవాసం ఏర్పడకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పశువులు, పందుల ఏరివేతను స్పెషల్ డ్రైవ్ ల ద్వారా ప్రణాళికాబద్ధంగా చేపట్టి, పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, అమ్మకం, వాడకం తదితర అంశాలపై దృష్టి సారించి, నిబంధనలను కఠినంగా అమలుచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పాదక సంబంధిత వాణిజ్య కేంద్రాలపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించాలని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన గడువు దాటినప్పటికీ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో స్పందన ఫిర్యాదులు ఇంకా పెండింగులో ఉన్నాయని, సూచించిన గడువులోపు పరిష్కరించాలని కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందనలో అన్ని విభాగాల అధికారులు ఓకే వేదికలో అందుబాటులో ఉంటారు కావున సమస్యల పరిష్కారం సులభతరం అవుతోందని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కారం పొందాలని కమిషనర్ సూచించారు. స్పందన వేదికలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్.ఈ సంపత్ కుమార్, ఎమ్.హెచ్.ఓ డాక్టర్ వెంకట రమణ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment