Trishul News

టిడ్కో గృహాల కేటాయింపు వేగవంతం చేయండి - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నవరత్నాలు పధకంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో భాగంగా నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కమిషనర్ హరిత ఆదేశించారు. టిడ్కో గృహాలు, జగనన్న కాలనీల ప్రగతిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు ప్రోత్సాహం కలిగించే దిశగా కొన్ని కాలనీల్లో అందమైన మోడల్ గృహాలను నిర్మించి ప్రదర్శనకు ఉంచాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, గృహ రుణాలను వేగవంతంగా మంజూరు చేయించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ప్రస్తుతం బేస్ మెంట్ పూర్తయిన గృహాలు, స్లాబ్ పూర్తి చేసుకున్న గృహాల వివరాలను అడిగితెలుసుకున్న కమిషనర్ మౌలిక వసతులను కూడా త్వరగా ఏర్పాటు చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని కమిషనర్ ఆదేశించారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు కొంతమంది ప్రస్తుతానికి నగర పరిధిలో అందుబాటులో లేరని, వారిని సంప్రదించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో తాత్కాలికంగా స్థిరపడిన గృహాల లబ్ధిదారులకు సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని అధికారులను కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర బాబు, నగర పాలక సంస్థ సెక్రటరీ హేమావతి, హౌసింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post