ఓటుకు రూ.6 వేలు ఇస్తాను.. పబ్లిక్‭గా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే..!

సులేబావి, త్రిశూల్ న్యూస్ :
రాజకీయాల్లో డబ్బులు, బహుమతులు పంచడం లాంటివి అత్యంత సాధారణ విషయం. అన్నీ కళ్ల ముందే ఉన్నప్పటికీ ఈ విషయం గురించి ఏ రాజకీయ పార్టీ బయటికి మాట్లాడదు. మహా అయితే ఇతర పార్టీల మీద ఇలాంటి విమర్శలు చేస్తారేమో కానీ, తాము పంచినట్లు బయటికి చెప్పరు. ఎప్పుడో ఏదో సందర్భంలో ఈ విషయమై కొందరు నేతలు నోరు జారుతుంటారు. కానీ వెంటనే తమ మాటల్ని ఎవరో వక్రీకరించారంటూ నాలిక కరుచుకుంటారు. అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూపాయలు బహుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ తాను డబుల్ ఇస్తానని రమేశ్ వాగ్దానం చేయడం గమనార్హం. రాష్ట్రంలోని సులేభావి ప్రాంతంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నగేశ్ మన్నోల్కర్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ జర్కిహోలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''మా ప్రత్యర్థి అభ్యర్థి 70 రూపాయల విలువైన డబ్బా, 700 రూపాయల ప్రెషర్ కుక్కర్ ఇస్తున్నారు. ఇంకా ఏవో బహుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిసింది. ఆ బహుమతులన్నీ కలిపితే 3 వేల రూపాయల కంటే తక్కువే ఉంటుంది. అయితే మేము అలాంటి బహుమతులేమీ ఇవ్వము. బహుమతులిచ్చి ప్రజల ఆలోచనల మీద పరీక్షలు పెట్టము. ఈరోజు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల సాక్షిగా చెప్తున్నాను. వారు ఇచ్చేదానికంటే డబుల్ నేను ఇస్తాను. ఎవరికైనా 6 వేల రూపాయలు అందకపోతే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకండి'' అని అన్నారు. రమేశ్ జర్కిహోళి చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ నేతలు ప్రజల హక్కును డబ్బుతో కొనాలని కుట్ర పన్నుతున్నారని, ప్రజలకు డబ్బులు పంచి అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే రమేష్ జర్కిహోళి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కర్ణాటక బీజేపీ వివరణ ఇచ్చింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు