Trishul News

జగనన్న కాలనీ పనులు వేగవంతం చేయండి - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. శనివారం హౌసింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక వెంకటేశ్వరపురంలోని జగనన్న కాలనీ లే అవుట్ ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు లే అవుట్ల నిర్మాణ పనుల్లో లక్ష్యాలను నిర్దేశించి అభివృద్ధి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డి.ఈ దయాకర్, ఏ.ఈ లు పాల్గొన్నారు. అనంతరం స్థానిక 54వ డివిజన్ 54/4 భగత్ సింగ్ కాలనీ వార్డు సచివాలయాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి క్షేత్ర స్థాయిలో సంక్షేమ పధకాలు అందేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. జగనన్న భూ హక్కు పధకంలో భాగంగా రీ సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించాలని కమిషనర్ ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post