టిడిపికి యువగళం పాదయాత్ర జీవన్మరణం..!
- యువగళంతో చాలా నోళ్లు మూయించాలి
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఆ పార్టీ భవిష్యత్తుకు క్రియాశీలకం. అధికారం రాకపోతే మనుగడే ప్రశ్నార్థకం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోవాలి. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా భవిష్యత్ అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పాదయాత్రను చేపట్టారు. పార్టీ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేడు కుప్పంలో ప్రారంభమవుతుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజుల పాదయాత్ర ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. నియోజకవర్గానికి ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. 125 నియోజకవర్గాలకు పైగా పాదయాత్ర సాగుతుంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని పూర్తీ చేసుకుని నారాలోకేష్ కుప్పం చేరుకున్నారు. ఉదయం 11 గంటల 3 నిమిషాలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం తొలి అడుగు పడనుంది. సాయంత్రం కుప్పంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. తొలిరోజు లక్ష్మీపురం నుంచి మొదలై ఓల్డ్ పేట్ చేరుకుంటారు. స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం పెద్దలతో సమావేశమవుతారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్, కుప్పం ప్రభుత్వాస్పత్రిక్రాస్, శెట్టిపల్లి క్రాస్ మీదుగా, పీఈఎస్ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర కొనసాగనుంది. 28న పీఈఎస్ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగుతుంది. 29న అరిముతనపల్లి నుంచి చెల్దిగానిపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది. కుప్పంలో మూడు రోజుల పాటు 29కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. కుప్పం నియోజకవర్గంలో జరిగే పాదయాత్ర వరకు మాత్రమే ఇప్పటి వరకు అనుమతి ఉంది. అది కూడా షరతులతో కూడిన అనుమతి. ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ఇంకా అనుమతి రాలేదు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గానికోసారి, జిల్లాకోసారి అనుమతిస్తారా ? లేదా మొత్తం ఒకేసారిగా అనుమతి ఇస్తారా ? అన్న చర్చ జరుగుతోంది. మూడు రోజులకు గాను ప్రభుత్వం 29 షరతలు విధించింది. పాదయాత్రను అడ్డుకునే కుట్రను తిప్పికొడతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర తెలుగుదేశానికి చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు వయసు మీదపడింది. ఇక నుంచి ఆయన పూర్తీ స్థాయిలో పార్టీని కంట్రోల్ చేయాలంటే చాల కష్టమని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన జీవితమంతా విరామం లేకుండా పార్టీ కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ తన సత్తాను నిరూపించుకోవాలి. ప్రజల్లో మమేకమై ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకోగలగాలి. తండ్రి చాటు బిడ్డ అనే అపవాదును తొలగించుకోవాలి. లోకేష్ రాజకీయాలకు అసమర్థుడనే ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది. ఆ ప్రచారాన్ని పాదయాత్రతో లోకేష్ తిప్పికొట్టగలగాలి. తన శక్తియుక్తుల్ని నిరూపించుకునే అవకాశం నారా లోకేష్ కి వచ్చింది. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే లోకేష్ భవిష్యత్తకు డోకా ఉండదు. లోకేష్ తనను తాను నిరూపించుకోకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. లోకేష్ విజయం పైనే తెలుగుదేశం విజయం ఆధారపడి ఉందన్నది కాదనలేని సత్యం.
యువగళంతో చాలా నోళ్లు మూయించాలి..!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో అనేక లాభాలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా లోకేష్‌పై వేసిన పప్పు అనే ముద్రను తుడిచేసుకోవడం కనిపిస్తోంది.లోకేష్‌కు మాట్లాడడమే చేతకాదు.. అని మంత్రులు రోజా.. వంటివారు బహిరంగంగానే విమర్శించేవారు. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలీదు అని ఎద్దేవా చేసేవారు. ఇక, వర్ధంతికి, జయంతికి కూడా తేడా తెలియదని కామెంట్లు చేసేవారు. ఇక, ప్రజాదరణ లేదని నాయకు డిగాకూడా నారా లోకేష్‌పై ముద్ర ఉంది. ఇటీవల మంత్రి నారాయణ స్వామి కూడా.. నారా లోకేష్ అంటే.. కేవలం చంద్రబాబు కొడుకుగా మాత్రమే తాము చూస్తామని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు నారా లోకేష్ యువగళాన్ని వినియోగించుకుంటున్నారని సుస్పష్టం. ఈ పాదయాత్ర ద్వారా.. మరో రెండు ప్రధాన లక్ష్యాలు సాధించాలని పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాటిలో ఒకటి.. తనను తాను నాయకుడిగా ఆవిష్కరించుకోవడం. తద్వారా.. పార్టీకి కాబోయే అధినేత గా ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ప్రజామోదం పొందడం కూడా ఈ యాత్ర వెనుక కీలకమైన విషయంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు టీడీపీ అంటే చంద్రబాబు మినహా మరొకరు మనకు కనిపించడం లేదు. దీనివల్ల రేపు పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనిని గమనించిన నారా లోకేష్. చంద్రబాబు కూడా యువగళం ద్వారా.. టీడీపీకి కాబోయే అధ్యక్షుడిగా నారా లోకేష్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారనేది కూడా తెలుస్తోంది అదే సమయంలో రాష్ట్రానికి యువ నేత దిక్సూచిగా మారనున్నారని కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. అంటే మొత్తంగా యువగళం ద్వారా.. ఇటు వ్యక్తిగతంగా అటు పార్టీ పరంగా.. మరోవైపు.. రాష్ట్రం పరంగా కూడా కొన్ని సంచలన విషయాలను ప్రజల్లోకి చేరాలనేది లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
Comments
Post a Comment