పుంగనూరు రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత..!
పుంగనూరు, త్రిశూల్ న్యూస్ :
పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది. ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు నియోజకవర్గంలో వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రామచంద్రయాదవ్ ఏర్పాటు చేసిన రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి.. తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్. ఆ సమయంలో కేంద్ర బలగాలతో రామచంద్రయాదవ్‌కు రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన అమిత్‌షా.. 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై+ కేటగిరి భద్రత మంజూరు చేశారు. తనకు వై+ కేటగిరి భద్రత కేటాయించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్. అయితే రామచంద్రయాదవ్ 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరులో పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలో ఓడినప్పటి నుంచి జనసేనకు దూరం జరిగి.. పుంగనూరు వేదికగా తన రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు రామచంద్రయాదవ్. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న కార్యక్రమాలు చినికి చినికి గాలివానగా మారిపోయాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా మలుపులు తిరుగుతూ స్థానికంగా హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఒకసారి జాబ్‌మేళ అని.. మరోసారి యోగా గురువు రాందేవ్‌బాబాతో గృహప్రవేశం అని.. తెగ హంగామా చేసిన రామచంద్రయాదవ్‌కు స్థానిక వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తున్నారు. గత నెలలో రామచంద్రయాదవ్ పుంగనూరులో రైతు సమస్యలపై రైతుభేరి నిర్వహించాలని అనుకున్నారు. రైతు భేరికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా ఆయన అనుచరులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. ఎల్ఐసీ కాలనీలోని యాదవ్ కొత్త ఇంటికి వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ర్యాలీ మొత్తం సీన్ మారిపోయింది. కొందరు వ్యక్తులు కర్రాలు, రాళ్లతో రాత్రివేళ రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్ల అద్దాలు పగులకొట్టారు. వైసీపీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని.. ఓ నేత ఆదేశాలతోనే ఈ దాడులు జరిగాయని.. పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఫైర్ అయ్యారు రామచంద్ర యాదవ్. దీనికి ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ద్వారా కౌంటర్లు ఇచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో అందరికీ షాక్ చేస్తూ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు రామచంద్రయాదవ్.. అదీ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం కోసం. ఇక ఈ సమావేశం పెద్ద చర్చగా మారింది. గల్లీలో జరిగిన గొడవను ఢిల్లీ దాకా తీసుకెళ్లడం.. అమిత్ షాకు అతను ఫిర్యాదు చేయడం పుంగనూరులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఓ నియోజకవర్గంలో ఎదిగీ ఎదగని నేతకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఏంటి..? అదీ 40 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడడం ఏంటి..? అనే అనుమానాలు వ్యక్తం చేసినవారు లేకపోలేదు. దేశంలో మోదీ తర్వాత నెంబర్ 2గా ఉండే అమిత్ షాతో కలవడం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది నేరుగా ఆయనను రామచంద్ర యాదవ్ కలవడం పెద్ద చర్చగా మారింది. మొత్తంగా ఆ భేటీలో ఇచ్చిన హామీ మేరకు రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రతను కేటాయించింది కేంద్ర హోంశాఖ.
Comments
Post a Comment