నారా లోకేష్ "యువగళం" మొదలు..!

- కుప్పంలో కదంతొక్కుతున్న తెలుగు తమ్ముళ్ళు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి 'యువగళం' పేరిట నారా లోకేశ్‌ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు. పాదయాత్ర సందర్భంగా తొలి రోజు జరిగే పూజా కార్యక్రమం, బహిరంగ సభకు బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు మహిళలు తిలకం దిద్ది, అభినందనలు తెలియజేశారు. యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్థానిక వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం తన పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.
తొలి రోజున ఆయన పాదయాత్ర 8.5 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఈ సభకు తరలిరానున్నారు. సభ నిర్వహణకు వారం కిందటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పాలకొల్లు, రేపల్లె ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'కుప్పం తెలుగుదేశం కుటుంబం ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు. తరగని మీ అభిమానాన్ని పొందిన నేను అదృష్టవంతుడిని. మీ ఆశీస్సులతో యువగళం పాదయాత్ర మొదలవబోతోంది.
 పాదయాత్ర ప్రారంభానికి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ పెద్దలు, నేతలు, అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని అన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు లోకేశ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువత భవిత కోసం. ప్రజల బతుకు కోసం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర అని ఆయన అన్నారు. మరోవైపు పాదయాత్ర నేపథ్యంలో కుప్పం పట్టణం పసుపుమయం అయింది. పట్టణం మొత్తం టీడీపీ జెండాలు, పాదయాత్ర బ్యానర్లతో నిండిపోయింది. వేలాది మంది టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు