జియాగూడ హత్య కేసు చేధించిన పోలీసులు.. చంపింది స్నేహితులే..!
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
నగరంలోని పురానాపూల్ సమీపంలో బైపాస్ రోడ్డుపై ఆదివారం అందరూ చూస్తుండగానే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆకాశ్, టిల్లు, సోనులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితులు ముగ్గురు కలిసి జియాగూడ రోడ్డుపై సాయినాథ్(32) అనే వ్యక్తిని దారుణంగా కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి చంపారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం అంతా చూస్తుండగానే హైదరాబాద్‌లో పూరానాఫూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై సాయినాథ్ అనే వ్యక్తిని ఆకాశ్, టిల్లు, సోనులు కలిసి దారుణంగా కత్తులతో పొడిచి, ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడ్ని మరో ముగ్గురు తరుముకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో కిరాతంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కాగా, హత్య చేసి నిందితులు పక్కనే ఉన్న మూసీనదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపుర సీఐ అశోక్ కుమార్ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుడి ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(32)గా పోలీసులు గుర్తించారు. అంబర్‌పేట బతుకమ్మ కుంట వాసి అయిన సాయినాథ్ ఓ కార్పొంటర్. ఆదివారం సాయంత్రం ఒంటరిగా ద్విచక్ర వాహనంపై పురానాపూల్ వైపు నుంచి జియాగూడ మేకలమండి మార్గంలో వెళ్తున్నాడు. పీలిమండవ్ శివాలయం సమీపంలో ముగ్గురు నిందితులు అతనికి అడ్డుగా వచ్చారు. ఆ తర్వాత ఇనుపరాడ్లతో తలపై తీవ్రంగా కొట్టడంతో సాయినాథ్ కిందపడిపోయాడు. సాయం కోసం పరుగెత్తినా.. వెంటపడి అతడిపై దాడి చేశారు. కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే సాయినాథ్ ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Post a Comment