యువగళం పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా శ్రేణుల పూజలు..!
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
నారా లోకేష్ చేపట్టేబోయే యువగళం పాదయాత్ర ప్రారంభ సభకు టీడీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. పాదయాత్ర ఎలాంటి అవాంతరాలూ లేకుండా విజయవంతంగా సాగిపోవాలని కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు మొదలుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేపడుతున్నాయి. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. కుప్పం పట్టణ పరిధి బైపాస్ రహదారి సమీపంలో కమతమూరు రోడ్డు పక్కన పది ఎకరాల స్థలంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా టీడీపీ ముఖ్య నేతలు ఆసీనులయ్యే విధంగా వేదికను నిర్మిస్తున్నారు. బహిరంగ సభా స్థలికి సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. లోకేష్ రాకను పురస్కరించుకొని కుప్పం పట్టణంలో పెద్ద ఎత్తున కటౌట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 26న తిరుమలలో దైవ దర్శనం ముగించుకొని లోకేష్ కుప్పం చేరుకుంటారు. 27న సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ప్రారంభిస్తారు.పాదయాత్ర కు షరతులు లేని అనుమతులు
నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కర్నూలులో టీడీపీ, తెలుగు నాడు యువత నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ వినాయక దేవాలయంలో పూజలు చేసి గుడి ముందు కొబ్బరి కాయలు కొట్టారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర కు షరతులు లేని అనుమతులు ఇవ్వాలని సోమిశెట్టి ప్రభుత్వాన్ని కోరారు.
అర్ధరాత్రి చీకటి జీవోలు జారీ..!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని, జగన్ అరాచక పాలన అంతం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ రకాలుగా తన సంఘీభావం తెలియజేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కొత్తలంక వలీ బాబా దర్గా లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ బాబాకు చత్రాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో గత నాలుగు ఏళ్లగా అరాచక పాలన సాగుతుందని జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కి రోడ్డు ఎక్కకుండా ఉండేలా అర్ధరాత్రి చీకటి జీవోలు జారీ చేయడం, పోలీసులను అడ్డుపెట్టుకొని గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. బాబా ఆశీస్సులతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Post a Comment