యువతకు భవితనవుతా.. అభివృద్ధికి వారధిగా నిలుస్తా - నారా లోకేశ్
- యువగళం పాదయాత్రపై ప్రజలకు నారా లోకేష్ లేఖ
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
యువగళం పేరిట 400 రోజుల సుధీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబసభ్యులు ఆశీర్వచనం అందించి పంపారు. లోకేశ్ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబసభ్యులు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం లోకేశ్ కడప బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. యువతకు భవితనవుతా, అభివృద్ధికి వారధిగా నిలుస్తానన్న లోకేశ్.. రైతన్నను రాజుగా చూసే వరకూ విశ్రమించబోనని స్పష్టం చేశారు. 27వ తేదీన కుప్పం నుంచి నారా లోకేష్ ప్రారంభిచనున్న యువగళం పాదయాత్రకు తల్లిదండ్రుల వద్ద నుంచి ఆశీస్సుకు తీుకుని బయలుదేరారు. కుటుంబసభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామ బాలకృష్ణ దగ్గరుండి కారు ఎక్కించారు. పాదయాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ప్రజలకు లోకేష్ బహిరంగలేఖ రాశారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన !
విభజన అనంతరం లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి చేసిన కృషి మీకు తెలుసు. ఒక్కచాన్స్ ఇవ్వండని కాళ్లావేళ్లా ప్రాధేయపడి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు లేరు. కర్షకులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ...ఇలా ప్రతివర్గం మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికంగా పౌరులకు ఇచ్చిన ప్రశ్నించే హక్కుని వైసీపీ నేతలు హరించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నియంత కంటే ఘోరంగా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులకు దిగారు. ప్రజల ప్రాణాలకూ రక్షణ లేదు. మహిళల మానప్రాణాలు దైవాధీనమయ్యాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే పరిశ్రమల యజమానుల్ని బెదిరించి పంపేస్తున్నారు. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడంలేదు. ఉన్నవీ తరిమేస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న రాజ్యాంగ, న్యాయవ్యవస్థలపైనా మూకదాడులకు తెగబడుతున్నారు.
మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత !
కుల,మత,ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగదోసి వికృత రాజకీయానికి తెరలేపారు. ప్రజలకు రక్షణ కల్పించి, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను జగన్ రెడ్డి తన ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడిపించే ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారు. అన్నివర్గాలకు అన్యాయంచేసిన వైసీపీ ప్రభుత్వం, అన్నిరంగాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పెను సంక్షోభంలోకి ప్రజల్ని నెట్టేస్తున్న సర్కారుని తక్షణమే గద్దె దింపాల్సిందే. తుగ్లక్ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వైద్య ఆరోగ్య రంగం పడకేసింది. జలవనరులశాఖ ఎంత అధ్వానంగా ఉందో కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం, ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు తేటతెల్లం చేశాయి. అప్పులు, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలు, వలసల్లో మన రాష్ట్రం మొదటిస్థానంలో ఉండటం మనమంతా సిగ్గుతో దేశం ముందు తలదించుకోవాల్సిన దుస్థితి. ప్రజల ప్రాణాలు తీసే ప్రమాదకర మద్యం అమ్మడమే ఆదాయంగా భావించే జగన్ రెడ్డిలాంటి సైకో పాలనకి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైంది.
యువత భవిత కోసం పాదయాత్ర !
ధాన్యం అమ్ముకొలేని రైతుల దైన్యం, చేసేందుకు పనిలేక వలసపోతున్న జనం, ఉద్యోగాలు దొరకక పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న యువత, పెరిగిన ధరలతో నిత్యావసరాలు కొనలేని సామాన్యులు, పన్నులతో బతుకు భారమైన ప్రజలు, గంజాయికి బానిసైన పిల్లల్ని చూసి రోదిస్తున్న తల్లిదండ్రులు, సకాలంలో జీతాలు అందని ఉద్యోగులు, బిల్లులు రాని కాంట్రాక్టర్లు... ఇవన్నీ సైకో పాలన దుష్ఫలితాలు. ఈ నేపధ్యంలో బాధితుల తరపున నేను ఉద్యమించాలని నిర్ణయించుకున్నాను. సైకో పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుక నేనవుతా. మీ సమస్యలు పరిష్కారానికి అరాచక సర్కారుతో పోరాడటానికి సారధిగా వస్తున్నాను. యువతకి భవితనవుతాను. అభివృద్ధికి వారధిగా నిలుస్తాను. రైతన్నని రాజుగా చూసేవరకూ విశ్రమించను. ఆడబిడ్డలకు సోదరుడిగా రక్షణ అవుతాను. అవ్వాతాతలకు మనవడినై బాగోగులు చూస్తాను. మీరే ఒక దళమై, బలమై నా యువగళం పాదయాత్రని నడిపించండి. మీ అందరి కోసం వస్తున్న నన్ను ఆశీర్వదించండి.. ఆదరించండని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. లోకేష్ మొదట కడప వెళ్తారు. అక్కడ దర్గాలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకుని పాదయాత్ర ప్రారంభస్థలం కుప్పం వెళతారు.
Comments
Post a Comment