యువగళం పాదయాత్రలో విషాదం.. హీరో తారకరత్నకు తీవ్ర అస్వస్థత..!
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పంలో నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో ఆ తాకిడికి తారకరత్న సృహతప్పి పడిపోయారు. కుప్పంలోని కెసి ఆసుపత్రికి తారకత్నను తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నిలకడగా తారకరత్న ఆరోగ్యం..!
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు ప్రథమ చికిత్స అందించిన కేసీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేరికి ఆయన స్పృహలో లేరని..పల్స్ రేట్ కూడా తక్కువగా ఉందని తెలిపారు. వెంటనే సీపీఆర్ చేయడంతో పల్స్ మెరుగుపడిందని వెల్లడించారు. ఆపై కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. వేరే ఆస్పత్రికి పంపామని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా కుప్పం పీసీఎస్ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మార్నింగ్ ఆయన అస్వస్థతకు గురవ్వడానికి కారణం గుండెపోటే అని నిర్ధారించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యలు తెలిపారు. తదుపరి వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆస్పత్రిలోనే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాలయ్యకు ఫోన్ చేసి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎంక్వైరీ చేశారు. అవసరమైతే బెంగళూరుకు తరలించాలని సూచించారు.
Comments
Post a Comment