సిరియాలో భారీ భూకంపం.. 100 మందిపైగా మృతి..!


టర్కీ, త్రిశూల్ న్యూస్ :

తుర్కియే, సిరియాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సిరియా సరిహద్దులోని గాజియంటెప్ సమీపంలో మొదటి భూకంపం సంభవించిందని అమెరికన్ జియోలాజిలక్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకటించింది. 15 నిమిషాల తర్వాత సెంట్రల్ తుర్కియేలో రెండో భూకంపం సంభవించింది.


రాజధాని అంకారాతోపాటు లెబనాన్, సిరియా, సైప్రస్‌లలో కూడా భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.17 గంటలకు మొదటి భూకంపం చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 100కి చేరినట్లు తుర్కియే, సిరియా అధికారుల ప్రకటనల ఆధారంగా తెలుస్తోంది. తుర్కియేలోని మలత్యాలో 23 మంది, సన్లిర్ఫాలో 17 మంది, దియాబకీర్‌లో 6గురు, ఒస్మానియేలో 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. సిరియా సరిహద్దుల్లో సుమారు 42 మంది చనిపోయినట్లు సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు తుర్కియేలో 53, సిరియాలో 42 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు.


మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. తుర్కియేలోని మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్‌ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరాయాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు నేలమట్టమైన ఫొటోలు భూకంప తీవ్రతను తెలియజేస్తున్నాయి. తుర్కియేలోని దియర్‌బకీర్‌ ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హతయ్‌ ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్‌ పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి. తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. జీఎఫ్‌జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది.


అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైందని యూఎస్‌జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది. భూకంపం నేపథ్యంలో తుర్కియేలో ఎమర్జెన్సీని ప్రకటించారు. తుర్కియేలో భారీగా భవనాలు కూలిపోవడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు తుర్కియే ప్రతినిధులు తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు.


Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు