మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15వేలు మందికి పైగా మృతి..!
టర్కీ, త్రిశూల్ న్యూస్ :
టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహాయ శిబిరాలను సందర్శించారు. ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తడంతో ఎర్డోగాన్ అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన భూకంప కేంద్రం కహ్రామన్‌మారాస్‌ను సందర్శించి అక్కడ సమస్యలను పరిష్కరించారు. లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకున్న ఆన.. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం సాధ్యం కాదని వెల్లడించారు. భూకంపం ధాటికి టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య 15 వేలకు పైగా దాటింది. గత దశాబ్ధ కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది ఇప్పటికే ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటి, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం నాటి 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో కనీసం 2,992 మంది మరణించారని, మొత్తం 15,383కి చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. ఈ సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు.బ్రస్సెల్స్‌లో ఈయూ సిరియా, టర్కీలకు అంతర్జాతీయ సహాయాన్ని సమీకరించడానికి మార్చిలో దాతల సమావేశాన్ని ప్లాన్ చేస్తోంది. అందరూ కలిసి జీవితాలను రక్షించేందుకు పని చేస్తున్నామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో 7.8-తీవ్రతతో కూడిన భూకంపం సోమవారం సంభవించింది. వేలాది నిర్మాణాలను కూల్చివేసింది. తెలియని సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. మిలియన్ల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.టర్కిష్ నగరాలైన గాజియాంటెప్, కహ్రామన్‌మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భారీ విధ్వంసం సృష్టించగా.. భవనాల మొత్తం నేలమట్టం అయ్యాయి. ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి దారితీసింది. వేల సంఖ్యలో కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. బెసిని నగరంలో 13 ఏళ్ల బాలిక, ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు. ఇక్కడ మొత్తం 9మందిని కాపాడారు. కహ్రామన్మారస్ నగరంలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. అదియమాన్ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు. 20 దేశాల నుంచి టర్కీకి వెళ్లిన అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో ప్రస్తుతం 60 వేలకు పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
Comments
Post a Comment