కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలి - బైరెడ్డి
- సంగమేశ్వరం వద్ద "బ్రిడ్జి కం బ్యారేజ్" నిర్మాణం చేపట్టే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
- కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉరితాడులా మారుతుంది
- సీమ ప్రాంత ప్రజల వ్యక్తిత్వాన్ని సినిమాల పేరుతో నాశనం చేశారు
- రాయలసీమలో ఫ్రాక్షనిజం ముసుగులో కాసుల కోసం తీసే సినిమాలకు ఇకపై స్వస్తి పలకాలి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద "బ్రిడ్జి కం బ్యారేజ్" నిర్మించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో స్టీరింగ్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతాన్ని సీఎం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమకు అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సీమ ప్రాంతంలోని ఎంపీలకు ఎమ్మెల్యేలకు స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పిస్తామని ఆ తర్వాత సంతకాల సేకరణ చేపడతామని అలాగే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను కలసి వినతి పత్రాలు ఇస్తామని తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేలా స్టీరింగ్ కమిటీలో తీర్మానం చేశారు. కర్ణాటకలో "అప్పర్ భద్ర ప్రాజెక్టు" నిర్మాణం రాయలసీమకు ఉరితాడులా మారుతుందని దీనిపై సీమ ప్రాంత ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి సైతం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమ ప్రాంతాల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సినిమాలలో చిత్రీకరించడం బాధాకరమన్నారు. అలాగే రాయలసీమను కించపరుస్తూ ఫ్యాక్షనిజంతో సినిమాలు తీయడంతో రాయలసీమ ప్రాంత ప్రాముఖ్యతను దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం ఆమోదముద్ర వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మరి నేడు మూడు రాజధానుల పేరుతో "పొయ్యి కింద మంట ఆరకుండా కట్టెలు వేస్తూ" పొగ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెప్తున్నారని తెలియజేశారు. రాయలసీమ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైంది అన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రంగా కరువు విలయతాండవం చేస్తున్నదని, పనులు లేక పక్క రాష్ట్రాలకు కూలి పనుల కోసం వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ ఈ ప్రాంతం ఫ్యాక్షనిస్టులాగా చిత్రీకరించడంతో ఈ ప్రాంతంలో పిల్లలకు పెళ్లయ్యేది కూడా ఇబ్బందికరంగా మారుతున్నదని గుర్తు చేశారు. రాయలసీమ అంటే ఫ్రాక్షన్ కాదని ఆత్మగౌరవానికి ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని సీమలో ఎంతోమంది మహానుభావులు తమ ఆస్తులను పేద ప్రజలకు పంచిన దాన గుణాన్ని చాటిన మహనీయుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తీయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి రాయలసీమలోని వివిధ జిల్లాల నాయకులు శ్రీకాంత్, అశోక్ వర్ధన్ రెడ్డి, రవి,బాలాజీ, సీమ కృష్ణ నాయక్, రవి కుమార్,
సుంకన్న, రమేష్, అమర్,కేశవ, మహేష్, చిన్ని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment