తారకరత్న మృతి.. ప్రముఖులు సంతాపం..!

త్రిశూల్ న్యూస్ డెస్క్ : 
సినీ హీరో నందమూరి తారకరత్న కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్ తీసుకువచ్చి మోకిలలోని తన ఇంటికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్‌ కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించటంతో బాలకృష్ణ హుటాహుటిన బెంగళూరు వచ్చి, వైద్యులతో చర్చించారు. రాత్రి వరకూ తారకరత్న ఆరోగ్యంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఆరోగ్యం మరింత క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో పోలీసుల భద్రత పెంచారు.

మెరుగవుతుందంటూనే..

జనవరి 27న 'యువగళం' పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను అదేరోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. ఆయన ఆరోగ్యంపై 28న వైద్యులు విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో వివరాల ప్రకారం.. గుండెపోటుకు గురైన 45 నిమిషాల వరకు తారకరత్న గుండెస్పందన నిలిచిపోయింది. మయోకార్డియల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌కు గురైన ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. అనంతరం గుండె స్పందించినా మెదడుకు సంబంధించిన సమస్య తలెత్తింది. శరీర అవయవాలన్నీ పని చేసినా మెదడు పనితీరు స్తంభించటంతో క్రమంగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. బెంగళూరులోని నిమ్హాన్స్‌ నుంచి న్యూరాలజీ వైద్యబృందం, నగరానికి చెందిన పలు విభాగాల వైద్యుల బృందంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వైద్యులూ తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షించినట్లు సమాచారం. క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు కనిపించినా.. ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ఏమీ చెప్పలేదు. తారకరత్న చిన్నాన్న రామకృష్ణ, పలువురు కుటుంబసభ్యులు, సినీరంగ ప్రముఖులు మాత్రమే తారకరత్న ఆరోగ్యంపై సమాచారాన్ని అందించారు.

ప్రముఖుల సందర్శన

తారకరత్న ఆస్పత్రిలో చేరగానే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల నుంచి పలువురు ప్రముఖులు నారాయణ హృదయాలయను సందర్శించారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తెలు నారాయణ హృదయాలయలోనే ఉండగా, సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌, ఉద్యానవనశాఖ మంత్రి మునిరత్న తదితరులు ఆస్పత్రిని సందర్శించారు.

తారకరత్న మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 'తారకరత్నను బతికించేందుకు చేసిన వైద్యనిపుణుల ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి.. చివరికి దూరమై మా కుటుంబానికి విషాదాన్ని మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తారకరత్న మరణం పార్టీకి, కార్యకర్తలు, అభిమానులకు తీరని లోటు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులూ సంతాపం వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం

నందమూరి తారకరత్న మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి కుటుంబసభ్యులకు ఒక ప్రకటనలో సానుభూతి ప్రకటించారు. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌ సంతాపం

దివంగత ఎన్టీఆర్‌ మనవడు, నటుడు తారకరత్న మరణం పట్ల సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబసభ్యులకు సీఎం తన సానుభూతి తెలియచేశారని ప్రభుత్వం శనివారం రాత్రి ఓ ప్రకటన జారీచేసింది.

బావా అనే ఆ గొంతు మూగబోయింది - లోకేశ్‌

బావా అంటూ ఆప్యాయంగా పిలిచే తారకరత్న గొంతు ఇక వినిపించదన్న విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 'నేనున్నానంటూ నా వెంట నడిచిన తారకరత్న అడుగుల చప్పుడు ఆగిపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది'. అని ఆ ప్రకటనలో తెలిపారు.

దురదృష్టకరం - పవన్‌

నటుడిగా రాణిస్తూనే ప్రజాజీవితంలో ఉండాలనుకున్న తారకరత్న ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు - కిషన్‌రెడ్డి

నందమూరి తారకరత్న మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న తారకరత్న చిన్నవయసులో మృతిచెందడం దురదృష్టకరమన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతిని తెలిపారు.

తారకరత్న మృతిబాధాకరం - రామ్మోహనరావు
తారకరత్న మృతికి టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు సంతాపం తెలిపారు. తారకరత్న మృతిబాధాకరం.. ఎన్టీఆర్ మనవడైనా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు, అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అభిమానుల ప్రార్ధనలు ఫలించి పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారని ఆశించాం. తారకరత్న ఇక లేరనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన ఆత్మశాంతికి భగవంతుని ప్రార్ధిస్తున్నాను. నందమూరి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలి -  బండి సంజయ్

సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు