జర్నలిస్టు కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చేర్మెన్ కు వినతి..!

- మీడియా అకాడమీ చైర్మన్ ను కోరిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు

- కొమ్మినేనిని మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించిన సంఘం సభ్యులు

- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా - కొమ్మినేని హామీ
విజయవాడ, త్రిశూల్ న్యూస్ 
 జర్నలిస్టులను ఫోర్త్ ఎస్టేట్ గా ప్రభుత్వాలు ఎంతోకాలంగా గుర్తించాయి. కానీ జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం మరిచాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసిన విధంగానే 'జర్నలిస్టుల కార్పోరేషన్' కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు కోరారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సి.ఆర్ మీడియా అకాడెమీ చైర్మన్ కార్యాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా తెలుగు రాష్ట్రాలలో ఐక్యత - సంక్షేమం - భరోసా నినాదాలతో ఏర్పాటైన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడవరపు రంగనాయకులు సంఘం తరపున జర్నలిస్టుల సమస్యలను, వారి సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా జర్నలిస్టుల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలిసిన మీ ద్వారా పరిష్కారం ఆశిస్తున్నామని విన్నవించారు. జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులలో అవకాశం కలిగించడం, ప్రెస్ క్లబ్ ల ఏర్పాటు, విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ, వెటరన్ జర్నలిస్టుల పేరు మార్పు, ఆరోగ్య భీమా, ప్రమాద బీమా పథకం అమలు, జర్నలిస్టులకు రాజకీయ ప్రాధాన్యం వంటి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయాలను ఆలకించిన కొమ్మినేని స్పందిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అయితే జర్నలిస్టులు అన్నీ కూడా ప్రభుత్వాన్ని అడగడం సరైంది కాదని, జర్నలిస్టులు వివిధ సంస్థల తరఫున పనిచేస్తున్నప్పుడు తమ మీడియా యాజమాన్యాన్ని కూడా కనీస వేతనాలు, భీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయాలని సూచించారు. వినతిపత్రంలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని జర్నలిస్టుల సంక్షేమానికి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ముందుగా ఇటీవల అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని, అక్కడ మీడియా ఎక్సలెన్సీ అవార్డు పొందిన సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు చైర్మన్ కొమ్మినేనిని దుశ్శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ సెక్రటరీ బాలగంగాధర్ తిలక్, సంఘం సభ్యులు రాజుపాలెం కోటేశ్వరరావు, మాలెంపాటి శ్రీనివాస్ రావు, మామిడాల శ్రీనివాసరావు, బోడపాటి సుబ్బారావు, వీర నారాయణ, దాసరి పూర్ణ, కట్టెపోగు ఉదయ భాస్కర్, సురేష్ తదతరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు