ఈనాడు విలేకరి ఇంటిపై వైసిపి నేతలు విధ్వంసకాండ..!

- పక్కనే ఉండి చోద్యం చూసిన పోలీసులు, అధికారులు

- కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు

- వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతోనే కక్ష సాధింపు 

- తీవ్రంగా ఖండించిన తెలుగు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘాలు
అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అక్రమాలను వెలికితీసి, వార్తలు రాస్తున్న బొమ్మనహాళ్‌ మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి వెంకటేశులుపై వైకాపా నాయకులు కక్ష సాధింపునకు దిగారు. శనివారం మధ్యాహ్నం జేసీబీతో వచ్చిన వైకాపా నాయకులు ఆయన ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని కూల్చివేశారు. పక్కాగా నిబంధనల మేరకు నిర్మించిన ఇంటిని.. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి కట్టారని ఆరోపిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఆరోపణలే ఆధారంగా కూల్చివేతల పర్వం కొనసాగింది. దీనికి రెవెన్యూ, పోలీసు అధికారులు దగ్గరుండి సహకరించడం మరింత దారుణం. స్థల వివాదంపై కోర్టు స్టే ఉందని చెప్పినా.. మందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాల్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించినా అన్నింటికీ అధికారుల నుంచి మౌనమే సమాధానమైంది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే అధికారులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీర్మానం చేసినట్లు ఆయా సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, అనంచిన్ని వెంకటేశ్వరరావులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

60 మంది ఇంటిపైకి దండెత్తి వచ్చారు..
శనివారం ఉదయం 11 గంటలకు వైకాపా నాయకులు కోటిరెడ్డి, బి.వన్నూరుస్వామి, పి. మారుతీప్రసాద్‌, శంకరయ్య, చంద్ర, సిద్ధేశ్‌, పెన్నయ్య, కె.వన్నూరుస్వామి ఆధ్వర్యంలో 60 మంది మూకుమ్మడిగా వెంకటేశులు ఇంటిపైకి జేసీబీతో వచ్చారు. దారిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారని ఆరోపిస్తూ తొలగించడానికి ప్రయత్నించారు. వివాదం కోర్టులో ఉందని చెప్పినా వినకుండా ఇంటి వెనుక భాగంలో ఉన్న బండరాళ్లను తొలగించారు. వెంటనే ప్రహరీ, మరుగుదొడ్డి గోడలను పగులగొట్టారు. అడ్డుకోవడానికి వెళ్లిన కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. దారిని ఆక్రమించినట్లు ఉంటే సర్వేయర్‌, రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేస్తారు కదా, మీకేం సంబంధం అని ప్రశ్నించగా.. గతంలోనే సర్వే చేశారంటూ దౌర్జన్యంగా నిర్మాణాలు కూల్చివేశారు. నిబంధనల మేరకు సర్వే చేసిన తర్వాతే ఆక్రమణలు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ వైకాపా నాయకులు నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు గ్రామ సర్వేయర్‌ వచ్చి కొలతలు తీసుకోవడం గమనార్హం.
కోర్టులో ఉన్నా..:
బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాల్‌ గ్రామంలో 1998లో ప్రభుత్వం వంద మందికి ఇంటి పట్టాలిచ్చింది. ఇందులో రోడ్డుకు ఆనుకుని 24వ ప్లాట్‌ను వెంకటేశులు భార్య రోజావతి పేరుతో పట్టా ఇచ్చారు. 2004లో ఆయన భార్య పేరుతో ప్రభుత్వ గృహం మంజూరు కావడంతో ఇల్లు నిర్మించుకున్నారు. వెంకటేశులుతో పాటు మరికొందరు రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించారని 2014లో అప్పటి సర్పంచి పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. 2016లో పంచాయతీ కార్యదర్శి రోడ్డును ఆనుకుని ఇల్లు నిర్మించిన 28 మందికి నోటీసులిచ్చారు. దీంతో 10 మంది ఇళ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 2017లో దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆక్రమణలు తేల్చాలంటే ముందుగా రెవెన్యూ అధికారులు పూర్తిగా సర్వే చేసి, వాళ్ల ఇల్లు, రహదారి ఎక్కడెక్కడ వస్తాయో చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని పేర్కొంది. రెవెన్యూ అధికారులు అప్పటి నుంచి ఎలాంటి సర్వే చేయలేదు. ఇటీవల ఆ స్థలానికి సంబంధించి రూ.10 వేలు చెల్లించి ఓటీఎస్‌ కింద వెంకటేశులు భార్య పి.రోజావతి పేరుతో రిజిస్టర్‌ చేసుకున్నారు. సర్వే నంబర్‌ 217-బి(2)లో ప్లాట్‌ నెంబర్‌ 24ను జగనన్న గృహ హక్కు పథకం కింద రిజిస్టర్‌ చేసి ధ్రువపత్రాలు కూడా అందించారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై ‘ఈనాడు’లో కథనాలు వస్తుండటంతో విషయాన్ని తిరగదోడారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లేఅవుట్‌లో 28 మందిపై ఆరోపణలు ఉండగా.. కేవలం వెంకటేశులు ఇంటి నిర్మాణాలు మాత్రమే తొలగించడం గమనార్హం. బొమ్మనహాళ్‌ ఎస్సై శివ, కానిస్టేబుళ్లు అశోక్‌, రాజకుళ్లాయప్ప ఆధ్వర్యంలోనే ఈ తంతు సాగడం గమనార్హం. కోర్టు స్టే ఉందని విలేకరి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదు. పైగా బాధితుడిపైనే మాటల యుద్ధానికి దిగారు. వైకాపా నాయకులను రెచ్చగొట్టి విలేకరి కుటుంబంపై దాడికి తెగబడ్డారు. వీఆర్వో యుగంధర్‌, పంచాయతీ కార్యదర్శి శివన్న, సచివాలయ సర్వేయర్‌, వీఆర్‌ఏలు దుర్గేశ్‌, వీరేశ్‌లకు కోర్టు ఉత్తర్వులు చూపినా పట్టించుకోలేదు. తన ఇంటి నిర్మాణాలను అక్రమంగా కూల్చారని వైకాపా నాయకులపై వెంకటేశులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

అక్రమాలపై రాసినందుకే..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎక్కడికక్కడ సమస్యలపై ప్రజలు ఆయన్ను నిలదీస్తున్న వైనంపై వార్తలు రాస్తున్న ‘న్యూస్‌టుడే’ విలేకరి వెంకటేశులుపై ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నారు. పలు సందర్భాల్లో ప్రజలు నిలదీసిన దృశ్యాలను వెంకటేశులు తన ఫోన్‌లో చిత్రీకరించగా.. వాటిని బలవంతంగా డిలీట్‌ చేయించారు. ఆయన్ను కొంత మంది వైకాపా నాయకులు గతంలో సెల్‌ఫోన్‌లో బెదిరించారు. ఇటీవల కాపు రామచంద్రారెడ్డి విలేకర్లను తీవ్రమైన పదజాలంతో దూషించడంతో వారు జిల్లా పోలీసు అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటేశులుపై అక్కసు పెంచుకున్న ఎమ్మెల్యే ఆయన్ను నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణాలు కూల్చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు