భూమి కోసం15ఏళ్ల పాటు పోరాడి.. చివరకు తుదిశ్వాస విడిచిన వికలాంగుడు వరదరాజు..!
సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :
జీవనోపాధి కోసం వికలాంగుల కోటా కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలోని తనకు ఇచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు కాసుల కోసం కక్కుర్తితో కిరికిరి చేసి సంపన్నులకు ఇచ్చి.. తనకు మాత్రం సాగుకి పనికిరాని శుద్ధమట్టి నేల గల భూమిని కేటాయించారు అంటూ దాదాపు 15ఏళ్ల పాటు కాళ్ళు లేకపోయినా.. మండుటెoడలను సైతం లెక్క చేయకుండా కాళ్ళు ఈడ్చుకుంటు స్థానిక రెవెన్యూ కార్యాలయం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యాలయాలకి, తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి సుదీర్ఘంగా ప్రదక్షణలు చేసి పోరాడి పోరాడి చివరకు బతుకు పోరాటంలో ఓడి.. ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు వరదయ్య పాలెంనకు చెందిన వికలాంగుడు వరదరాజులు (56).
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెంకి చెందిన వరదరాజు పుట్టుకతోనే కాళ్ళు లేకుండా వికలాంగుడుగా పుట్టాడు. జీవనోపాధి కోసం స్థానిక ఆర్టీసీబస్టాండ్ వద్ద గల మరుగుదొడ్ల నిర్వహణతో చాలీ చాలని ఆదాయంతో తనను నమ్ముకున్న వృద్ధురాలు అయిన తల్లిని పోషిస్తున్నాడు. తన దయనీయ పరిస్తితిని నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కు విన్నవించగ.. మానవతా దృక్పథంతో కలెక్టర్ స్పందించి వికలాంగకోటాలో జీవనోపాధి కోసం భూ పంపిణీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు కురుంజలం రెవెన్యూలో రెండెకరాల సాగుభూమిని పంపిణీ చేశారు. తనకు సాగు భూమిని ఒకటి చూపించి.. పట్టాదారు పాసుపుస్తకాలులో సాగుకు పనికి రాని రాళ్ళురెప్పలుతో, గులకరాల్లు గల శుద్ధ మట్టి నేలను నమోదు చేశారు రెవిన్యూ అధికారులు. సాగుకు పనికిరాని భూమి తనకెందుకు అంటూ.. నాకు కేటాయించిన భూమిని తనకు కేటాయించాలని 15యేళ్లు కాళ్ళు లేకనే కాళ్ళు ఈడ్చుకుంటూ చిత్తూరు, తిరుపతి, వరదయ్య పాలెంలోని ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి అధికారులను వేడుకున్న పలితం లేకపోయింది. చూస్తాం చేస్తాం వంటి హామీలతో అధికారులు మారారే తప్ప అతని సమస్యను ఏ ఒక్కరూ పరిష్కరించ లేకపోయారు. చివరకు ఆదివారం సాయంత్రం హఠాన్మరణంతో ఈ పాడులోకం విడిచి వెళ్ళిపోయాడు. అతని మృతితో ఒంటరిగా ఉన్న తల్లికి సాయం చేసి ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment