ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసిపి దాడులపై సీబీఐ విచారణ జరపాలి - చంద్రబాబు
- అంగళ్లులో నాపై జరిగిన దాడి ప్రణాళికతో, కుట్రతో చేసిందే
- నాపై హత్యాయత్నం చేసి.. నాపైనే హత్యాయత్నం కేసు పెడతారా?
- ప్రతి పక్ష ప్రశ్నలకు దమ్ముంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- నేడు క్యాడర్ పై అక్రమ కేసులతో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ పన్నాగం
- టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడి విలేఖరుల సమావేశం వివరాలు
విజయనగరం, త్రిశూల్ న్యూస్ :
సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా 2,500 కిలోమీటర్ల దూరంతో రాష్ట్రమంతా తిరుగుతున్నాను. జరిగిన విధ్వంసం, అన్యాయం, అవినీతి అన్నీ ప్రజలకు తెలియచేయడమే నా పర్యటన లక్ష్యం. దానిలో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో నాపై హత్యాయత్నం చేసి, నాపైనే హత్యాయత్నం కేసుపెట్టారు. ఇదెక్కడి దుర్మార్గమో అర్థంకావడం లేదని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం విజయనగరంలో పర్యటనలో భాగంగా అయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..
మంత్రి, అతని తమ్ముడు కుట్రపన్ని నాపై తప్పుడుకేసులు పెట్టించారు
★ నేను రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఒక కాంట్రాక్టర్..అతనే మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్న అతని తమ్ముడు కలిసి కుట్రపన్ని నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గాలేరు-నగరి కాలువ నుంచి హంద్రీనీవా కాలువకు సమాంతరంగా కాలువతవ్వే పనిని మంత్రి రామచంద్రారెడ్డికి చెందిన పీ.ఎల్.ఆర్ కంపెనీకి అప్పగించారు. వారుతీసుకున్న కాంట్రాక్ట్ తాలూకా పనుల్ని పరిశీలించ డానికి వెళ్లినప్పుడు స్థానిక రైతులు నాకు ఫిర్యాదుచేశారు. ఆర్ అండ్ ఆర్ ఇవ్వ కుండా, ల్యాండ్ అక్విజేషన్ చేయకుండా, అధికారులు..పోలీసులసాయంతో మా భూములు లాక్కున్నారని చెప్పారు. వారికి ధైర్యం చెప్పి, తిరిగి నేను వస్తుండగా అంగళ్లులో అప్పటికే కాపుకాచి ఉన్న వైసీపీమూకలు, నన్ను ముందుకు వెళ్లనీయకుండా అడ్డగించి, నాపై హత్యాప్రయత్నానికి ఒడిగట్టారు. మా సీ.ఎస్.వో అప్పటికే జిల్లాఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించారని పేర్కొన్నారు.
నా కార్యక్రమానికి మీరు అడ్డుతగిలారా... మీ కార్యక్రమంలోకి మేం వచ్చామా?
వైసిపి వారు దాడిచేస్తుంటే ఎన్.ఎస్.జీ భద్రతాసిబ్బంది రక్షణలోఉన్న నేను పారిపోవాలా? ప్రధానప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి అయిన నేను పారిపోతే, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నాతోపాటు ఉన్న ఎన్.ఎస్.జీ సిబ్బంది నాపై దాడి జరుగుతుందని అనుమానం వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తమై వారివద్ద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ షీట్ ను ఓపెన్ చేసి, నాకు రక్షణగా అడ్డుపెడతారు. వారు అలా పెట్టాక కూడా రాళ్లువేశారు. వైసీపీ మూకలు రాళ్లువేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడ్డారు. నన్ను అడ్డుకొని నామీదనే దాడిచేసి, తిరిగి నేను కుట్రపన్ని వారిని చంపడానికి వచ్చానని కేసుపెడతారా? నా కార్యక్రమానికి మీరు అడ్డుతగిలారా..? లేక మీ కార్యక్రమానికి అడ్డుకోవడానికి నేనువచ్చానా? సమాధానం చెప్పండి. తప్పు మీరుచేసి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టేవరకు వచ్చారంటే, ఎంత బరితెగించారో అర్థమవుతుంది. మనుషుల్ని చంపేయడం.. తిరిగి చనిపోయిన వాళ్ల మనుషులపై తిరిగి కేసులు పెట్టడం ఇదీ వీళ్లు చేస్తున్నది అంగళ్లులోనే కాదు.. గతంలో యర్రగొండపాలెంలో ఇలాగే నాపై రాళ్లదాడి చేశారు. నందిగామలో దాడిచేశారు. మా సీ.ఎస్.వో తలకు గాయాలయ్యాయి. ఇలా ఒక పథకం ప్రకారం నాపై దాడిచేసి, పోలీసుల్ని నిర్వీర్యంచేసి, ఇష్టానుసారంగా లేనిపోని బెదిరింపులకు పాల్పడుతూ, నన్ను అడ్డుకోవాలని చూస్తారా? పుంగనూరులో నా టూర్ ఉందని తెలిసి మీరెందుకు రోడ్డుపైకి వచ్చారు? రోడ్డుపైకి వచ్చిన వైసీపీ వాళ్లు, కిరాయిమూకల్ని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? వాళ్లు రాళ్లేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఎందుకు నిలబడ్డారు? ఎవరి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు నాపై దాడిచేస్తున్నారని తెలిశాకే మా పార్టీ కార్యకర్తలు, నేతలు రోడ్డుపైకి వచ్చా రు. అంగళ్లులో దాడిజరిగిన తర్వాత పార్టీవాళ్లతో పాటు సాధారణప్రజలుకూడా వచ్చారు. ఆ సమయంలో నేను చెప్పాను.. పుంగనూరులోకి రావడంలేదని, నేరుగా పూతలపట్టు వెళ్తానని చెప్పాను.అయినా వినలేదు. జరిగిన దారుణంపై జిల్లా ఎస్పీని ప్రశ్నించాను.. సమాధానం లేదు. జరిగిన ఘటనపై తప్పుడు కేసులు పెట్టమని మొలకలచెరువు సీఐని బలవంతం చేశారు. అతను ఒప్పుకోలేదని వీ.ఆర్ కు పంపారు. ఎవరైనా కచ్చితంగా డ్యూటీ చేస్తే వారిని వీఆర్ కు పంపడం.. తప్పుడు పోలీసుల్ని అడ్డంపెట్టుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయడం వీళ్లకు అలవాటుగా మారిందన్నారు.
సీబీఐ విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయి
పట్టపగలు నడిరోడ్డుపై ఎన్.ఎస్.జీ, ప్రజలు, మీడియా సమక్షంలో నాపై దాడిచేశారు. జరిగింది ఆషామాషీ ఘటన కాదు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరగాలి. అక్కడేం జరిగింది.. ఎవరు చేయించారు? ఈ హత్యాయత్నంలో ఎవరి పాత్ర ఉంది.. ఎవరి ఆదేశాలతో చేశారనే మొత్తం వివరాలు తెలియాలంటే సీబీఐ విచారణే సరైన మార్గం. నాపైనే కాదు.. ప్రజలపై దాడులు చేస్తున్నారు...తప్పుడు కేసులతో భయపెడుతున్నారు... గట్టిగా ప్రశ్నించేవారిని చంపేస్తున్నారు. ప్రజల ఆస్తులు, భూములు లాక్కుంటున్నారు అడ్డొచ్చిన వారిపై కేసులుపెడుతూ, అధికార మదంతో విర్రవీగుతున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణాలపై సమగ్రమైన విచారణ జరగాలి. అప్పుడే నాకైనా, ప్రజలకైనా ఒక నమ్మకం ఏర్పడుతుంది. సైకో, దుర్మార్గుడు, మూర్ఖుడు, పిచ్చివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నిఆస్తులు పోతాయి.. ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది.. రాష్ట్ర, ప్రజల భవిష్యత్ ఎలా అంధకారమవుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నేరస్తుల్ని కట్టడి చేయాలి .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు.. వీళ్లను వదిలిపెట్టను.
జరిగిన ఘటనపై రాష్ట్రపతికి..ప్రధానికి లేఖరాస్తానని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్రహోం మంత్రి, గవర్నర్ కు లేఖరాస్తాను. వదిలిపెట్టను.. వీళ్లపై పోరాడతాను తప్ప వెనకడుగు వేయను. ఇలాంటి వికృతమైన చర్యలు చరిత్రలో ఎప్పుడైనా చూశామా.. విన్నామా? ఇలా చేసి దొంగఓట్లు వేయించుకొని మరలా గెలవొచ్చన్నదే వీళ్ల పన్నాగం. ప్రజాక్షేత్రంలో వీళ్లను దోషులుగా నిలబెట్టి బుద్ధిచెప్పే వరకు పోరాడతాను. బాబాయ్ హత్య కేసులో ఎన్ని విన్యాసాలు చేశారు. ముందు నారాసుర రక్తచరిత్ర అన్నారు.. తరు వాత గుండెపోటు అన్నారు. సీబీఐని అడ్డుకోవడానికి ఎన్ని డ్రామాలాడారో చూశాంకదా! సీబీఐ వారు ఆసుపత్రిలోకి వెళ్లలేకపోయారు. నేరస్తులు పేట్రేగిపోతే దర్యాప్తు సంస్థలు, చట్టాన్ని కాపాడేవారు లొంగిపోవాలా?
అందర్నీ చంపి రాష్ట్రాన్ని శ్మశానం చేస్తారా?
గతంలో కూడా నాపై చాలాసార్లు దాడికి యత్నించారు. ఎక్కడా వీళ్ల ఆటలు సాగలేదు. ఎక్కడైతే పుంగనూరులో అసలుదోషి ఉన్నాడో, ఎవడైతే ప్రజల ఆస్తులు, భూములు లూఠీచేశాడో, అతని ఆధ్వర్యంలో నాపై హత్యాప్రయత్నం జరిగితే, పోలీసులు ఏంచేశారు? మావాళ్లు ఎస్పీకి ఫిర్యాదుచేశారు.. స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పారు. అయినా వైసీపీ మూకలు, కిరాయి వ్యక్తులు రోడ్డుపైకి ఎలా వచ్చారు? చిత్తూరు ఎస్పీ గతంలో నర్సీపట్నంలో అడిషనల్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఒకతన్ని చితకబాది హింసించారు. ఆ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ గా స్పందించింది. అప్పుడు అతనిపై హత్యాయత్నం కేసుపెట్టాలని చెప్పింది. అలాంటి వ్యక్తిని చిత్తూరులో నియమించి, మీ ఇష్టమొచ్చినట్టు చేసి నాపై కేసులు పెడతారా? అందర్నీ చంపేసి రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా? మీ ఆటలు సాగనివ్వం.. మీరు అనుకునేది జరగనివ్వం. పిచ్చివాడి చేతిలో రాజ్యాధికారం ఉంటే ఇలానే ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వ వైఖరిపై ఏం చేయాలో ఆలోచిస్తాం. సిగ్గు లజ్జ లేకుండా మీరు వ్యవహరించి, మాపై రాళ్లు విసిరి, కార్యకర్తల తలలు పగలగొట్టి తిరిగి మాపైనే కేసులు పెడతారా? గతంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరుపున పుంగనూరులో ఎవరినీ పోటీ చేయనివ్వలేదు. నామినేషన్లు వేస్తే చంపేస్తామని బెదిరించారు. ఏమిటిది.. పుంగనూరు ప్రత్యేకరాజ్యమా? అక్కడ చట్టం.. న్యాయం పనిచేయవా? పాలరైతులు కూడా వీళ్లు చెప్పిన ధరకే పాలుపోయాలి. రైతుల భూములు లాక్కుంటే, వారు ఎన్.జీ.టీని ఆశ్రయిస్తే వారిపై దాడిచేస్తారా? ల్యాండ్ అక్విజేషన్ కు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా రైతుల్ని బెదిరించి బలవంతంగా భూములు లాక్కొని, ఇష్టమొచ్చినట్టు కాలువలు తవ్వితే దానిపై రైతులు ఎన్.జీ.టీని ఆశ్రయించారు. ఎన్.జీ.టీ రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వానికి రూ.100కోట్ల జరిమానా విధించింది. సిగ్గు లేకుండా వీళ్లు ఎన్.జీ.టీ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తే, అత్యున్నత న్యాయస్థానం కూడా వీళ్లను చీవాట్లుపెట్టి, ముందు రూ.25కోట్లు ఎన్.జీ.టీకి కట్టండి.. తరువాత వాదనలు వింటామని చెప్పింది. ఎన్.జీ.టీ తప్పుపట్టిన పనుల్ని నేను అడ్డుకున్నానంటారా? నష్టపోయిన రైతులు న్యాయస్థానాలను, ఎన్.జీ.టీని ఆశ్రయించకూడదా?
పెద్దిరెడ్డి మంత్రా..లేక కాంట్రాక్టరా? రూ.8వేలకోట్ల పనుల్ని నిబంధనలకు విరుద్ధంగా మంత్రి సంస్థకు కట్టబెడితే ప్రశ్నించకూడదా?
రూ.8వేలకోట్ల రూపాయల పనుల్ని మంత్రి కంపెనీకి అప్పగించారు. అతను మంత్రా.. లేక కాంట్రాక్టరా? కాంట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయ్. మంత్రిగా ఉండాలనుకుంటే సక్రమంగా ప్రజలకోసం పనిచేయ్. రూ.8వేలకోట్ల పనుల్ని నిబంధనలకు విరుద్ధంగా మంత్రి సంస్థకు అప్పగిస్తే మేం ప్రశ్నించకూడదా? సిగ్గు లేకుండా మదమెక్కి నాపై హత్యాయత్నం చేసి, నాపైన.. మావాళ్లపైన కేసులు పెడతారా? ఎన్.ఎస్.జీ భద్రతాసిబ్బంది నాకు రక్షణగా నిలవాలా.. మీరు దాడిచేసి నాపైహత్యాయత్నం కేసులుపెడితే నేను భయపడాలా ? నాతోపాటు ఎవరుంటే వారిపై కేసులు పెట్టారు. ఒక కానిస్టేబుల్ 50, 60 మందిని గుర్తించాడట.. అతని స్టేట్ మెంట్ ఆధారంగా కేసులు పెట్టారట! కానిస్టేబుల్ పేరుతోనే కేసులన్నీ పెట్టారు. ఎక్కడి నుంచో డ్యూటీ చేయడానికి వచ్చిన కానిస్టేబుల్ అక్కడున్న వారిని గుర్తుపడతాడా? దీన్ని ఇంతటితో వదిలి పెట్టను. మేం కేసులు పెడితే తీసుకోరు. తిరిగి మాపైనే కేసులు పెట్టి, పోలీసుల్ని బెదిరించి బలవంతంగా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదుచేస్తున్నారు. పిచ్చితనానికి కూడా హద్దు లు ఉంటాయి. నావెంట ఎవరొస్తే వాళ్లను అదర్స్ గా చేర్చి కేసులు పెట్టడం దుర్మార్గం కాదా? అంగళ్లులోనే కాదు.. విశాఖ విమానాశ్రయంలో నన్ను అడ్డుకున్నారు, నందిగామలో అడ్డుకున్నారు.. తిరుపతిలో అలానే చేశారు. నా ఇంటిపైకి దాడికి వచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాలపై మాట్లాడామని మా పార్టీ కార్యాలయంపై దాడిచేశారు. ఇలా ఎన్ని ఉన్నాయో. రాష్ట్రంలో కేసులు లేనిది ఎవరిపై చెప్పండి.. ఈనాడు, ఆంధ్రజ్యోతిపై, టీవీ5 పై, గిట్టని మీడియా సంస్థలపై, వాటి యాజమాన్యాలపై కేసులు పెట్టారు. చిరంజీవి ఏదో అన్నాడని ఆయన్ని అంటున్నారు. వీళ్లు ఎవరిని వదిలిపెట్టారు చెప్పండి?
కేసులకు భయపడను.. ఎన్నిపెట్టుకుంటారో పెట్టుకోనివ్వండి
వైసిపి వాళ్ళు చేసే దుర్మార్గాల్లో, నేరాల్లో పోలీసుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. చిత్తూరు ఎస్పీ కళంకితుడు, అతనిపై గతంలో కేసు ఉంది.దాన్ని చూపించి, అతన్ని భయపెట్టి నాపైకి ఉసిగొల్పారు. రాత్రి నేను బహిరంగసభలో మాట్లాడుతుంటే కోరుకొండలో కరెంట్ ఆపేశారు. పోలీసులు మాకు ప్రత్యర్థులా? వాళ్ల పని లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయడం. వైసీపీ వాళ్లను రోడ్డుపైకి రాకుండా చేయాల్సింది పోలీసులేగా? నాపై దాడిచేస్తుంటే, నేను పారిపోవాలా? అప్పుడు పోలీసులు హ్యాపీగా ఉంటారా? రాష్ట్రం నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలి.. ఏమీ మాట్లాడకూడదు. నా కార్యక్రమానికి రావడానికి వీళ్లెవరు.. వీళ్లకు ఎవరిచ్చారు అధికారం? ప్రజలు తిరగబడితే బటలిప్పుకొని పారిపోతారు వీళ్లు. నాపై ఎన్ని కేసులుపెట్టారు.. భయపడ్డానా? పెట్టుకోనివ్వండి.” అని చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలో తన పర్యటనలో వైసీపీ నేతల దాడులు, అరాచకాలు, పోలీసుల వైఫల్యం, గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు, రక్షణ కల్పించిన NSG విజువల్స్ ను మీడియా సమావేశంలో ప్లే చేసి చూపించారు.
Comments
Post a Comment