వెట్రి వేల్ మురుగునికి హరోహర.. నామస్మరణతో మారుమోగిన గుడివంక..!
- వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
భక్తులు శరీరానికి శూలాలు గుచ్చుకొని.. వీపుకు కొక్కీలు గుచ్చుకుని తేరు లాగుతూ.. కావిళ్లు మోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. వేల్ వేల్ వట్రి వేల్.. హరోహర నామ స్మరణలతో గుడువంక ఆలయ పరిసరాలు మార్మోగాయి.
మూడు రాష్ట్రాల కూడలిలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం గుడివంకలో కొలువై ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి అడికృత్తిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్ల మూల విరాట్ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో వివిధ రూపాలలో భక్తులు తమ భక్తిని ప్రదర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలోని పలు ప్రాంతాల భక్తులు వీపులకు తేర్లు.. రాగుల గుండ్లు లాక్కొంటూ కావిళ్లతో తరలివచ్చారు. గుడివంక రోడ్లు కిక్కిరిశాయి. పలువురు భక్తులు వీపులకు కొక్కీలతో క్రేన్‌లకు వేలాడుతూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు.
స్వామి అమ్మవార్ల సేవలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్సి కెఆర్జె భరత్ పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటి చేర్మెన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నదానం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. గుడుపల్లె, కామసముద్రం పోలీసులు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.
Comments
Post a Comment