నేడు తెలుగుభాషా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక వ్యాసం - రచయిత వడ్డేపల్లి మల్లేశం

త్రిశూల్ న్యూస్ డెస్క్ :

         దాదాపుగా 2700 సంవత్సరాలుగా తెలుగు భాష తన సొంత వైవిధ్యాన్ని చాటుకుంటూ అనేక చారిత్రక విషయాలను తనలో ఇముడ్చుకొని విరాజిల్లినప్పటికీ మారుతున్న కాలక్రమంలో పరభాషా మోజులో క్రమంగా మరుగున పడుతుందేమో అనే ఆందోళన మనందరినీ కలచివేస్తున్న ప్రస్తుత సమస్య.

        ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగు వాళ్ళు ఉన్న ఛోటా ప్రపంచస్థాయిలో ను నిర్వహించడం జరుగుతున్నది. ఒక భాషకు దినోత్సవాన్ని సంతరించుకోవడానికి ప్రధానమైన కారణం ఆ భాషను సజీవంగా ఉంచి భావితరాలకు అందించాలనే తపన. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించిన తెలుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి అనిర్వచనీయమైనది. సంస్కృత భాష ముసుగులో ఉండి సామాన్య ప్రజలకు తెలుగుభాష అందుబాటులో లేని కాలంలో తెలుగును వ్యావహారిక భాషలోకి మార్చి సామాన్య ,పామరులకు కూడా చదువుకునే పరిస్థితి కల్పించిన రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. వారు ఉపాధ్యాయులు ,పండితులు, మేధావులే కాక తెలుగు భాషను వ్యావహారిక వాదంలోకి మార్చడంతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేయడంవల్ల సవర జాతి కోసం నిఘంటువు, లిపి అందించి వారి అక్షరాస్యతకు కృషి చేసినారు.
తెలుగు భాష చరిత్ర..!
        మూడు లింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ దేశమని ఇక్కడి ప్రజలు మాట్లాడే భాషనే తెలంగాణ తెలుగు అంటారని క్రమంగా తెలుగు భాషగా మారిందని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడున్నర కోట్ల మంది ఫ్రెంచ్ మాతృభాషలో మాట్లాడేవారు ఉంటే అంతకుమించి 7.9 కోట్ల ప్రజలు మాతృభాషగా గల తెలుగు ప్రపంచంలో 15వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో 8 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటే ప్రపంచ స్థాయిలో మరో కోటి మంది వరకు తెలుగు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నవి. క్రీస్తు పూర్వం200 సంవత్సరంలో హాలుడు రచించిన గాధాసప్తశతి లోనే తెలుగు భాష వాడబడింది అని, అమరావతిలో లభించినటువంటి శాసనాలపై "నాగబు" అనే పదము తొలి తెలుగు పదం అని విశ్లేషకులు చెబుతున్నారు. క్రీ.శ. 525 ప్రాంతంలో చోళరాజులు తమ యుద్ధాలలో సాధించిన విజయాలకు గుర్తుగా తెలుగులో శిలాశాసనాలు వేయించే వారట. ఇక సంస్కృతం నుండి తెలుగు భాషలోకి అనువదించడం నన్నయచే 11వివిధ అభివృద్ధి శతాబ్దంలో ప్రారంభమైనది అనే విషయాన్ని మనం అందరం గుర్తించవలసి ఉన్నది. ఈనేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ఒత్తిడి కారణంగా 2008లో తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడం జరిగింది కానీ కొన్ని భాషల వారు ప్రకటించిన అభ్యంతరాలను మద్రాస్ హైకోర్టు కొట్టి వేస్తూ ప్రాచీన హోదాను అధికారికంగా ప్రకటించింది.

తెలుగు భాష సుసంపన్నం..!
               పన్నెండవ శతాబ్దంలో శతకాల సృష్టి ,14వ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు తెలుగు భాషా సేవ, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆదరణ పరంపరగా కొనసాగి తెలుగు భాషా వ్యాప్తికి కృషిజరిగినది. 19వ శతాబ్దంలో పరవస్తు చిన్నయసూరి కథలు వ్యాకరణం అందించడంతో పాటు కందుకూరి గురజాడ మొదలుకొని గిడుగు రామ్మూర్తి వరకు చేసిన కృషి, పోషణ, ఆదరణ, సాహిత్య సృష్టి వలన తెలుగు భాష ఉన్నత స్థాయిలో కొనసాగి సుసంపన్నమైనది.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దుస్థితి..!

     దాదాపు 16 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేవాళ్లను ఒక్కటి చేయలేకపోవడానికి కారణం తెలుగు మాట్లాడే వారు వేరు వేరు రాష్ట్రాలు, ప్రాంతాలలో ఉండడమే. తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది కోట్లు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏడు కోట్లు, ప్రపంచంలో కోటి మందికిపైగా తెలుగువారు భారత దేశంలో హిందీ తర్వాత తెలుగు మాతృభాషగా మాట్లాడేవారు రెండో స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 88శాతం ప్రజలు తెలుగు మాట్లాడే వారు ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల్లో తెలుగును వెతుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అని భాషా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత మూడు వందల సంవత్సరాలలో ప్రపంచంలో గల ఆరు వేల భాషల్లో మూడు వేల భాషలు అంతరించి పోగా రాబోయే మూడు వందల సంవత్సరాల్లో తెలుగు భాష అసలే ఉండదని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

 తెలుగు భాష ప్రమాదంలో పడిందా..?

     భాషలు అంతరించి పోవడం అనేది మానవాళి సాంస్కృతిక వైభవానికి, నాగరికతా నేపథ్యానికి గొడ్డలిపెట్టు ఐక్యరాజ్యసమితి యునెస్కో వారి మాటల్లో ఒక భాష ప్రమాదంలో పడడం అంటే ఒక జాతి పిల్లలు కనీసం 30 శాతం మంది తమ సొంత భాష నేర్వడం మానేస్తే వారి భాష ప్రమాదంలో పడ్డట్టే అని ఆ సంస్థ నిపుణులు తెలిపారు. 2012లో తిరుపతిలో 2017లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినప్పటికీ సభలో చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడంబరంగా మాత్రం నిర్వహించడం హాస్యాస్పదమే. ఒకటవ తరగతి నుండి ఉన్నత స్థాయి వరకు తెలుగు ఒక భాషగా కొనసాగించే విధానానికి ఉత్తర్వు జారీ చేసినప్పటికీ తెలంగాణ, ఆ.ప్ర లలో పూర్తిస్తాయిలోఅమలు కాకపోగా ఇతర రాష్ట్రాలలో ఒకభాషగా కొంతవరకైనా అమలుకావడం పట్ల సంతోషంగా ఉంది. పెద్ద గ్రామాలలో 21 శాతం ఉంటే పట్టణ జనాభాలో 25 శాతంగా ఉన్న ఆంగ్ల మాధ్యమ పిల్లలు తమ నిత్య జీవిత వ్యవహారంలో ఆంగ్లమును మాట్లాడడంతో సరాసరి తెలుగు భాషకు దూరమైన వారి సంఖ్య 20 నుంచి 25 శాతంగా ఉన్నట్లు లెక్కించారు. ఇలాంటి పరిస్థితిలో గత కాలంలో వాడిన పదాలు కానీ నేడు వాడుకలోని తెలుగు పదాలే కనుమరుగైనప్పుడు భవిష్యత్తు తరం సాహిత్యాన్ని సృష్టించ లేదు. కనీసం చదవగలిగే స్థితిలో కూడా ఉండదు. అందుకే ప్రస్తుత స్థితిని గమనించి భవిష్యత్తు గురించి ఆలోచించాలి .ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకం లేదు. న్యాయస్థానాల్లో, పోలీసుల కార్యాలయాలు, పాఠశాలల్లో సైతం తెలుగు భాషకు ఆదరణ తగ్గడం ఆలోచించాల్సిందే.

తెలుగు భాష గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు..!

         ఈ రకంగా ఒక భాష అంతరిస్తే ఆ జాతి అంతరించినట్లు. సామ్రాజ్యవాద పోకడల వల్ల కూడా అనేక జాతులు, సంస్కృతులు, భాషలు, అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఆంగ్లేయుల పాలనలో ప్రారంభమైన పరాయీకరణ స్వపరిపాలనలో మరింత ఎక్కువ కావడం అనుచితం. బహుళజాతి సంస్థలను ఆహ్వానించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలను ఎదుర్కొవలెనో! ఏమో?

 ➡️ ఏ భాషనైనా తనలో ఇముడ్చుకునే శక్తి, ప్రతిభ అన్ని భాషల కన్నా ఎక్కువ తెలుగు భాషకు ఉంది - ప్రొఫెసర్ హాల్డేన్ 

➡️ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని కాళోజీ మందలించాడు.

➡️ గుడ్డ గట్టిన గంపెడు కొడుకులు ఉండి ఇల్లు వాకిలి కరువైన తల్లివీవు - జంధ్యాల

➡️ జగతి తల్లికంటె సౌభాగ్య సంపద మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె నాలుగవ శతాబ్దిలో వినుకొండ వల్లభరాయుడు

మాతృ భాష ప్రాధాన్యత..!

     ప్రజా పరిపాలన జరగాలి అంటే క్రింది వాడికి అర్థం కావాలంటే అది మాతృభాషలో నడవాలి. నడవాలంటే చదువుకున్న వాడికి మాతృభాష రావాలి. చదువుకున్న వాడికి మాతృభాష రావాలంటే చెప్పేవారికి మాతృభాష రావాలి. అందుకే తెలుగు మీడియం ఉండాలి అంటూ వావిలాల గోపాలకృష్ణయ్య భాషకు మాతృభాషగా ఉండాల్సిన స్థాయిని వర్ణించాడు.

     " గుండెలోతుల్లోంచి వచ్చేది మనసు విప్పి చెప్పగలిగింది మాతృభాషలోనే తెలుగు మన వారసత్వ సంపద మాతృభాషను ప్రేమించలేనివాడు, మాతృదేశాన్ని ప్రేమించలేడు. అలాగే సొంత భాషలపై పట్టు ఉంటేనే పరాయి భాష పై పట్టు దొరుకుతుంది అధ్యయనం చేయగలం.

  మనలో దాగి ఉండే విస్తృతమైన సృజనాత్మకత మాతృభాష ద్వారానే సులభంగా అర్థమవుతుంది. ఇది గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును అనుసంధానం చేసి స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.

     2017 లో హైదరాబాదులో తెలుగు మహాసభలు నిర్వహించినప్పుడు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మహాసభల నిర్వహణ ఒక ఎత్తయితే తీర్మానాలు ఆచరించడం మరొక ఎత్తు సాధ్యమైనంత మేరకు పరిపాలనలో తెలుగు భాషను ప్రవేశపెట్టాలి కనీసం ఏడవ తరగతి వరకు వీలైతే 10వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కొనసాగించాలి అని సూచన చేశారు.

 కానీ ఏ ఒక్క సూచన అమలు చేసిన దాఖలా మన రాష్ట్రంలో లేదు. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా చేస్తేనే తెలుగు భాష అమలు విజయవంతం అవుతుంది.

     తెలుగు భాష అమలు కోసం తెలుగు భాషా సమాఖ్య ,మరికొన్ని సంస్థలు పోరాడవలసి రావడం దురదృష్టకరం.

➡️ తెలుగుతల్లి విగ్రహం పై గల ఆంగ్ల పదాలను తొలగించి తెలుగు తల్లి అని తెలుగులో చెక్కించారు.

➡️ సెక్రటేరియట్ అనే పదాన్ని తొలగించి సచివాలయముగా మార్చడానికి కూడా ప్రాతినిధ్యం చేయవలసి వచ్చింది.

➡️ 2003 మే 22వ తేదీన పాఠశాలలో తెలుగు భాషా బోధన తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడింది.

➡️ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభల అనంతరం కూడా ప్రతి పాఠశాలలో తెలుగు భాష విషయంగా బోధించాలని ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఆ వైపుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

      ప్రభుత్వం ముందు తెలుగు భాష పరిరక్షణకు కొన్ని డిమాండ్లు..!

➡️ రెండు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గం, రాజ్భవన్ చర్చల్లో తెలుగును తప్పనిసరి చేయాలి.

➡️ సచివాలయంలో కూడా తెలుగులోనే కార్యక్రమాలు కొనసాగించాలి.

➡️ కార్యక్రమాల నిర్వహణ తెలుగు భాషలో తెలుగు సంస్కృతిలో జరగాలి.

➡️ తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే ఉత్పత్తులపై మిగతా భాషలతో పాటు తెలుగును విధిగా ముద్రించాలి.

➡️ తెలుగు భాష వినియోగం వికాసాల అమలుకు తమిళనాడు వలె తెలుగు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.

➡️ నామమాత్రంగా కొనసాగుతున్న అధికార భాషా సంఘాన్ని తెలుగు భాష అమలు కోసం వినియోగించాలి 

➡️ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో తెలుగులో రాసే అవకాశం తోపాటు తెలుగులో రాసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి

➡️ ప్రైవేటు పాఠశాలల పై పూర్తి అజమాయిషీ సాధించి అన్ని పాఠశాలల్లో కనీసం ఏడవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగేలా చూడాలి.

➡️ గ్రామాలు పట్టణాల్లో గ్రంథాలయాలను విరివిగా స్థాపించిప్రామాణిక గ్రంథాలను అందుబాటులో ఉంచాలి.

➡️ తెలుగు కంప్యూటరీకరణ తో పాటు ఈ స్థాయిలో పాలనా, న్యాయస్థానాలలో తీర్పులు తెలుగులోనే వచ్చేలా చూడాలి.

      తెలుగు భాషా పరిరక్షణ దిశలో పత్రికలు, మేధావులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, రచయితలు ముందుకొస్తున్నారు. పాఠశాలల విద్యార్థులతో మమేకమై వివిధ సంఘాలతో సహా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భాషను పూర్తిస్థాయిలో అమలు చేసుకునే విధంగా కృషి చేయాలి. పక్క రాష్ట్రమైన తమిళనాడులో డిగ్రీ స్థాయి వరకు వారి మాతృభాష అయిన తమిళంలోనే బోధన కొనసాగుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకు వచ్చిన ఆటంకం ఏమిటో ప్రభుత్వం ఒక కమిటీని వేసి విచారించి సిఫారసు ద్వారా దానిని పూర్తిగా అమలు పరచాలి.
          రచయిత :-  వడ్డేపల్లి మల్లేశం
(వ్యాసకర్త సా.రా. విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ సంఘ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు