రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు..!

- కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

 - పిసిసి ప్రధాన  కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు డిమాండ్
 తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్కీం వర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వాటిని పరిష్కరించలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని పిసిసి కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు విమర్శించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిని వాటికన్ సిటీగా అభివృద్ధి చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రోడ్లు వేసి డివైడర్లకు రంగులు, బొమ్మలు వేసినంత మాత్రాన తిరుపతి వాటికన్ సిటీ అవుతుందా అని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, వాహన బ్యానర్లకు, కళ్యాణ కట్ట పీస్ రేట్ బార్బర్లకు జీతాల పెంపు, శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో ఇచ్చిందే తప్ప ప్రభుత్వం పెంచింది కాదని చెప్పారు. తిరుపతిలో అభివృద్ధి సైతం టీటీడీ భాగస్వామి అయ్యింది కాబట్టి పురోగతి కనిపిస్తోందని ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది కాదని తెలిపారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు, ఆశ వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచుతానని, కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీని పర్యవసానంగానే నేడు రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు చివరికి వాలంటీర్లు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు సైతం ఉద్యమ బాట పట్టే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోందన్నారు. వైసిపి నాలుగున్నరేళ్ళ పాలనలో పెరిగిన ధరలు, పన్నుల భారాలు, నిరుద్యోగం, దౌర్జన్యాలు, దాడులు ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయన్న విషయం అందరికీ తెలుసన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని నేడు ప్రజలు ఏమాత్రం భరించే పరిస్థితిలో లేరని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నేను ఉన్నాను.. విన్నాను.. చూశానని ప్రజలను నమ్మించిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమి చేశారు చూస్తున్నారని, ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంత సంపాధించారో అర్ధం చేసుకుంటున్నారని చెప్పారు. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, ఉన్నత విద్యావంతులు ఎదురు చూస్తుంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆటాడుకుందాం రా అనడం జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రహిత పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏపికి  ప్రత్యేక హోదా సాధన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు