బాబు రావాలి .. భవిష్యత్తు మారాలి - టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి

చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ :
సంపద సృష్టి కర్త, విజన్ కలిగిన నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. అందుకే బాబు కావాలని అలాగే నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పులివర్తి నాని గెలవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె పాకాల మండలం, దామలచెరువు పంచాయతీ, రాజీవ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పులివర్తి సుధారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. జాబు రావాలన్నా, భవిష్యత్తు మారాలన్నా జరగబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలవాలన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. చెవిరెడ్డి లాంటి ఎమ్మెల్యేను తాను జీవితంలో చూడలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.64వేల కోట్ల రూపాయలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం బటన్‌ నొక్కడం వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయిందని ఆమె ఆరోపించారు.
జాబ్‌ క్యాలెండర్, సీపీఎస్‌ రద్దు, మద్య నిషేధం, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదు? అని ప్రశ్నించారు. థాయిలాలతో చెవిరెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ప్రశాంతమైన చంద్రగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని విమర్శలు గుప్పించారు. గంజాయి మత్తులో అమాయకులపై దాడులు పెరిగిపోయాయన్నారు. గంజాయి.. గంజాయి అంటూ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఊదరగొట్టుతున్నా బాధ్యులపై ఒక్క కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. పులివర్తి నాని గెలుపుతో చంద్రగిరి పరిస్థితులు మారుతాయని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పులివర్తి నానిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు