మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు - ఎస్పీ
- సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పి మలిక గర్గ్
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం త్రినేత్ర అతిథి గృహములో ముందస్తు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా ఎస్పి మలిక గర్గ్, కలెక్టర్ లక్ష్మి శలు సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆచరించవలసిన ప్రణాళికను దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి, అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అశేషంగా వచ్చే అవకాశం ఉంది, తదనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని సుమారు 1000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత చర్యలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోటు పాట్లను బెరీజు వేసుకుంటూ సరికొత్త ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో సమిష్టి గా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, అదే సమయంలో వీఐపీలకు కూడా తగిన సమయం కేటాయించి ఆ సమయంలోనే వారు దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఊరేగింపు సమయంలో మాడవీధులలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహా శివరాత్రి పర్వదినాన జిల్లాలోని ఇతర ముఖ్యమైన శైవ క్షేత్రాలలో కూడా భక్తుల సౌకర్యార్థం అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. కావున శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల బందోబస్తు విధుల నిమిత్తం అవసరమైన ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, ఇతర జిల్లాల నుండి పోలీసులు బందోబస్తు విధుల నిమిత్తం వస్తున్నారు. అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎన్జీవోలు కూడా పోలీస్ శాఖకు సహాయం చేస్తున్నారన్నారు. 8వ రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ సమయంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీసు సిబ్బంది, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు ఐసిడిఎస్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాల గురించి అవగాహన కార్యక్రమాలు మరియు సదస్సులు నిర్వహిస్తూ బాల్య వివాహాలను సమూలంగా నిరోధిస్తున్నామన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తీసుకోవాల్సిన చర్యలపై మరియు భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు. బ్రహ్మోత్సవాల సమయంలో శివయ్య దర్శనానికి అశేష భక్త జనులు వచ్చే అవకాశం ఉన్నందున, మొదటి ప్రాధాన్యతగా సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రముఖులకు కూడా అనుకూల సమయంలో దర్శనం కల్పించే ఏర్పాట్లపై చర్చించారు. వైద్య సిబ్బంది 24/7 ఎల్లవేళలా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు అగ్ని ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అగ్నిమాపక సిబ్బంది 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్థానికుల యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలలో అన్నదానం చేసేవారు, భక్తుల కొరకు ఇతరత్రా సేవలందించేవారు నిర్దిశించిన ప్రదేశాలలో మాత్రమే ఏర్పాట్లు చేసుకుని, భక్తులకు సేవ చేస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల సమన్వయంతో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడి నుండి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ సమయానుకూలంగా భక్తులకు ఉత్తమ సేవలు అందించి విజయవంతం చేస్తామన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యటించి, భక్తుల భద్రతపై ఏర్పాటు చేసి ఉన్న ఎంట్రీ/ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లు, అత్యవసర మార్గాలను పరిశీలించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా, గట్టి భద్రతా చర్యలను తీసుకోవాలని జిల్లా ఎస్పి మలిక గర్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మి శ మాట్లాడుతూ సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గత బ్రహ్మోత్సవాల అనుభవాలు, లోటుపాట్లును అధిగమించి ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయిలో నగరం, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు , దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్నారు. పోలీస్ శాఖ ఎలాంటి చిన్నపాటి సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు, భక్తులకు భద్రత , పార్కింగ్, వాహనాల దారి మళ్లింపు వంటివి చూడాలని అన్నారు. ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలిగితే భక్తులకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. అన్నదానం చేసేవారు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలనీ అన్నారు. రెవెన్యూ యంత్రాంగం ప్రోటోకాల్ , పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపిఎస్ దేవరాజ్ మనిష్ పాటిల్, అదనపు ఎస్పీలు వెంకటరావు, కులశేఖర్, విమల కుమారి, రాజేంద్ర, డిఎస్పిలు భాస్కర్ రెడ్డి ఎస్బి, తిరుపతి ట్రాఫిక్, ట్రైనీ డిఎస్పి సింధు ప్రియ, ఆలయ చైర్మన్ అంజూరి శ్రీనివాసులు, ఈవో, సీఐలు, ఎస్సైలు, ఇతర అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment