ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను వైసిపి మోసం చేసింది - టిడిపి ఎమ్మెల్సిలు
- 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్న
- మీ పాలనలో మోసం, ద్రోహం, అన్యాయం మాత్రమే యువతకు చేశారని మండిపాటు
- ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి ఎమ్మెల్సిలు బహిరంగ లేఖ
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఐదేళ్ల మీ పాలనను వెనక్కి తిరిగి చూస్తే యువతకు మీరు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం మాత్రమే కన్పిస్తున్నాయని, నాడు ప్రతిపక్ష నేతగా మీరు మాట తప్పం మడమ తిప్పం అనే నినాదంతో నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి నిరుద్యోగులను నయవంచన చేశారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు విమర్శించారు. శనివారం టిడిపి ఎమ్మెల్సిలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని లేఖలో ద్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా కూడా వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, ఎన్నికలకు 60 రోజుల ముందు కేవలం 6100 పోస్టులకే నోటిఫికేషవ్ ఇవ్వటం నిరుద్యోగుల్ని దగా చేయటమేనని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2023 అసెంబ్లీ సమావేశాలలో, గౌరవ మండలి సభ్యులు అడిగిన ప్రశ్న LAQ-13311-Q కి సమాధానంగా రాష్ట్రంలో 18,520 టీచర్ ఉద్యోగాలు ఖాళీలున్నాయని లిఖితపూర్వకంగా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, కానీ నేడు కేవలం 6100 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని లేఖ ద్వారా ఎద్దేవా చేశారు. మీకు నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే 18,520 ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్బంగా వారు డిమాండు చేశారు. రాష్ట్ర పురోగతికి కీలక పాత్ర పోషించే పవర్ సెక్టార్ నందు కూడా ఉద్యోగాల భర్తీ జరగలేదని, ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్ కో, డిస్కంల నందు 12,000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నా, వాటిని ఇంతవరకు భర్తీచేయకపోవటం వల్ల నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తీవ్రంగా నష్టపోయారన్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మీ ప్రభుత్వ అలసత్వం కారణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత 5 ఏళ్ల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక రాష్ర్టంలోని నిరుద్యోగ యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, దీర్ఘకాలంగా నోటిఫికేషన్ లేకపోవడంతో వయోపరిమితి మించిపోయి నోటిఫికేషన్ కు అర్హత కోల్పోతున్నారు కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగార్థులకు వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలని లేఖలో కోరారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రిపరేషన్ కి కేవలం 79 రోజుల సమయం ఉండటంతో ఉద్యోగార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, చిరుద్యోగులు, టీచర్లు మరియు సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర పని ఒత్తిడి కారణంగా పరీక్షలకు సన్నద్దం కాలేకపోతున్నారని ప్రైరేషన్ కు తగినంత సమయం ఇచ్చి నిరుద్యోగులు పట్ల మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి రాసిన లేఖలో ఎమ్మెల్సిలు కోరారు.
Comments
Post a Comment