రూ.50వేల కు మించితే సీజ్ చేస్తారు.. సీజ్ చేసిన నగదు తిరిగి పొందడం ఎలా ..?
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు రూ. 170 కోట్ల డబ్బు, బంగారం, వెండి, లిక్కర్, మత్తు పదార్థాల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మే 13న ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి.ఈ ప్రక్రియ అంతా ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లో ఉండనుంది. ఎన్నికల్లో డబ్బు, ఇతరత్రా ప్రలోభాలను అరికట్టేందుకు 89 పోలీస్ చెక్ పోస్టులు సహా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు అన్నీ కలిపి 200 టీమ్‌లు పనిచేస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లేందుకు వీలుండదు. అంతకంటే ఎక్కువగా డబ్బులు తీసుకెళ్తుంటే తగిన ఆధారాలు చూపించకపోతే సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సాధారణంగా ఎన్నికల నిబంధనలను అనుసరించి తగిన ధ్రువీకరణపత్రాలు లేకుండా ఒక వ్యక్తి 50 వేల రూపాయలకు మించి తీసుకెళ్లేందుకు వీలుండదు. అంతకుమించి తీసుకెళ్లాలంటే తప్పకుండా తగిన ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. నగదును తీసుకెళ్తుంటే దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేలా తగిన డాక్యుమెంట్స్ ఉండాలి.బంగారం కొంటే దానికి సంబంధించిన బిల్లులు తప్పనిసరి. డబ్బులను ఎక్కడి నుంచి డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారు? దానికి తగిన మరిన్ని డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని చూపించవచ్చు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలి. ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు చెల్లింపులు చేసేందుకు వెళుతుంటే సదరు సంస్థకు చెల్లింపులు చేయాల్సిన వివరాలు చూపించాల్సి ఉంటుంది.
ఎప్పుడు సీజ్ చేస్తారు?
పోలీసులు లేదా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో పరిమితికి మించి నగదు తరలిస్తూ కనిపిస్తే సీజ్ చేస్తారు. నగదు లేదా వస్తువులకు సంబంధించి రసీదులు లేకపోతే వెంటనే సీజ్ చేస్తారు.ఇలా సీజ్ చేసినప్పుడు సదరు వ్యక్తికి రసీదు ఇస్తారు. అందులో పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది.ఎంత విలువైన వస్తువులు, డబ్బు సీజ్ చేశారు, ఎక్కడ సీజ్ చేశారు, జిల్లా స్థాయి నోడల్ అధికారి వద్ద అప్పీల్‌కు అవకాశం.. నోడల్ అధికారి పేరు, వివరాలు ఇస్తారు. అలాగే, సీజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రక్రియను వీడియో తీస్తారు.
సీజ్ చేసిన సొమ్ము తిరిగి పొందడమెలా?
సీజ్ చేసినప్పుడు ఇచ్చిన రసీదు ఆధారంగా జిల్లా స్థాయిలో అప్పీల్ చేయవచ్చు.రోజూ జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశమవుతుంది. ఇలా వచ్చే అప్పీళ్లపై విచారణ చేసి తగిన రసీదులు ఇవ్వడం లేదా ఎన్నికలతో సంబంధం లేదని తేలితే డబ్బును తిరిగి వెనక్కి ఇస్తుంది. నిత్యం జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బు లేదా వస్తువులకు సంబంధించి తగిన డాక్యుమెంట్స్ ఇస్తే తిరిగి ఇచ్చేయాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
సీజ్ చేసిన డబ్బు, వస్తువులను ఏం చేస్తారు?
డబ్బు లేదా వస్తువులు సీజ్ చేశాక వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు ట్రెజరీకి తరలిస్తారు. కొన్ని సార్లు కోర్టులో సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ ప్రక్రియ జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో డబ్బు పంపించవచ్చా?
ఆన్‌లైన్‌లో డబ్బు పంపించడం లేదా ఫోన్ పే, గూగుల్ పే సహా యూపీఐ పేమెంట్స్ చేసినా తెలిసేలా ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.ఈ విషయంలో బ్యాంకులు, ఆదాయ పన్ను(ఐటీ) విభాగం ఒకే గొడుగు కిందకు వచ్చి పనిచేస్తున్నాయి. ఏదైనా బ్యాంకు ఖాతాకు ఎక్కువగా డబ్బు జమ అవుతుంటే సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డేటా వస్తుంది.ఏ బ్యాంకు అకౌంట్ నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగాయో తెలుస్తుంది. కొన్ని వ్యాపారాల్లో నిత్యం లావాదేవీలు జరుగుతుంటాయి. అలాంటి సందర్బాల్లో సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా జరుగుతుంటే ఆ వివరాలు సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి డేటా వస్తుంది. ఆ వివరాలు బ్యాంకుల నుంచి నేరుగా ఐటీ విభాగానికి వెళ్తాయని, వాళ్లు పరిశీలించి తదుపరి చర్యలు ఉంటాయి.
సీజ్ చేయడంపై వస్తున్న విమర్శలేంటి?
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని నియత్రించే చర్యల్లో భాగంగా ఇలాంటి నగదు, వస్తువులను సీజ్ చేసే నిబంధనను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. తగిన రసీదులు లేకుండా తీసుకెళుతున్న డబ్బు, వస్తువులు, బంగారం, వెండి, లిక్కర్ వంటివి నిలువరించే ప్రయత్నమిది. కానీ ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నగదును సీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంట్లో పెళ్లి ఉన్నప్పుడు బంగారం కొనాలి. ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న అయిదు లేదా పది లక్షల డబ్బును బంగారం షాపుకు తీసుకెళ్లే సమయంలో తనిఖీలలో పట్టుబడితే సీజ్ చేస్తారు. ఊళ్లలో పొలం అమ్మితే డబ్బు వస్తుంది. దాన్ని తీసుకెళ్లే క్రమంలో పట్టుబడితే సీజ్ చేస్తున్నారు. హాస్పిటల్ బిల్లు కింద అర్జెంటుగా లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరినో చేబదులు అడిగి తీసుకెళతాం. అప్పుడు సీజ్ చేస్తే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తే చాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అలాగే అధికారులు పది లక్షల రూపాయలకు మించి సొమ్మును ఇలా విడిచిపెడుతుంటే మాత్రం ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో డబ్బుల తరలింపుపై మినహాయింపులు ఉండవు. బ్యాంకులు డబ్బు తీసుకెళుతున్నా పోలీసులు ఆపితే తగిన ధ్రువీకరణపత్రాలు చూపాల్సిందే.
ప్రలోభాలపై మీరు ఫిర్యాదు చేయొచ్చా?
ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. సీవిజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే యాప్‌లో ద్వారా వేలల్లో కంప్లయింట్స్ వచ్చాయి. ఇందులో ఫోటోలు, వీడియోలు తీసి అప్ లోడ్ చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, ఫోన్ నంబరు గోప్యంగా ఉంచుతారు. అలాగే రహస్యంగా ఉంచాలనే ఆప్షన్ అందులో ఎంచుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన లోకేషన్ బట్టి దగ్గర్లో ఉన్న ఫ్లయింగ్ స్వ్కాడ్ వచ్చి ప్రలోభ పెట్టేవారిపై చర్యలు ఉంటాయి. గంట లేదా గంటన్నరలోనే చర్యలు తీసుకుని ఫిర్యాదు స్టేటస్(పురోగతి)ను అప్ లోడ్ చేస్తారు. సీవిజిల్ యాప్‌లోనే కాకుండా 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి, లేదా భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Post a Comment