నామినేషన్ల ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు.. ఓటర్ కార్డుల పంపిణీకి చివరి తేదీ ఇదే..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. గురువారం నోటిఫికేషన్ జారీ‎తో అసలైన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. అన్ని జిల్లాల అధికారులు క్రమం తప్పకుండా నివేదికలు పంపించాలని ఆదేశించారు. అక్రమ రవాణా నియంత్రణలో ఇప్పటికి కొన్ని జిల్లాలు వెనుకబడి ఉండటంపై సీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 4లోపు ఎపిక్ కార్డులు పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దీంతో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా ఎన్నికల కోడ్ అమలు తీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. గురువారం నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని జిల్లాల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించడంతో పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ విషయంలో పలు జిల్లా అధికారులపై అసంతృప్తి..?

ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటి నుండి నివేదికలను ప్రతి రోజూ ఈసీకి పంపాల్సి ఉంటుందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా క్రమం తప్పకుండా పంపాలన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యాలయాల్లోగాని, పోస్టాఫీసుల్లో గాని ఎపిక్ కార్డులు ఏమాత్రం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియోకాన్పరెన్సు నిర్వహిస్తున్నదని.. ఈ లోగానే పెండింగ్‎లో ఉన్న కార్డుల పంపిణీని పూర్తిచేయాలని ఆదేశించారు. సి-విజిల్ యాప్ ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పరిష్కరిస్తున్నారని అభినందించారు. ఆస్తుల అక్రమ రవాణాను నియంత్రించడం, స్వాధీనం చేసుకోవడంలో కూడా మంచి ప్రగతిని కనబరుస్తున్నారని అభినందించారు. అయితే కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఆయా జిల్లాలు కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్‎పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇదే సమయంలో సామాన్య ప్రజలను ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సెంటర్లకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావల్సిన పరిశీలకులు, ఏఆర్ఓల ప్రతిపాదలను సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ, కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు