మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు - మంత్రి సీతక్క.

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. గత ఏడాది కేవలం 15,400 కోట్ల రుణాలు ఇచ్చారని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క శనివారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు మహిళా సంఘాలకు రూ. పది వేల లోన్ ఇవ్వాలంటేనే బ్యాంకులు భయపడేవన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. ఐక్యతను అభివృద్ధిని సాధిస్తున్నమని సీతక్క తెలిపారు. పేదలకు పేదలే బందువులుగా ఉంటారన్నారు. అందుకే పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పథాన నిలపాలన్నదే మా సంకల్పమని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని మంత్రి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకే బ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలని ఆదేశించారు. తమ అవసరాలు తీరుస్తారనే విశ్వాసాన్ని బ్యాంకులు కల్పించాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను పారిశ్రామికవెత్తలుగా చేయడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్స్ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామని పేర్కొన్నారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు విద్యార్థులకు అందించిన చరిత్ర మహిళా సంఘాలకే దక్కుతుందని కొనియాడారు. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్నపుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘ సభ్యులకు జీవిత భీమా కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు. కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వమే పెండింగ్ లోన్లు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు కొత్త ఉపాధి అవకాశాలు ప్రతిపాదించండి, బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానిగా సేవలందించారని గుర్తుచేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు