రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..!
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి.. వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖాధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం.. అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి.. అర్హులైన రైతుల గుర్తింపునకు విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించటంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి అమలు తీరుపైనా దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? తద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధివిధానాలుండాలి? అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. వీటన్నింటిపైనా వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి.. నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది.
Comments
Post a Comment