Trishul News

ఆంధ్రరాష్ట్రంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం - చిత్తూరు జిల్లా కలెక్టర్

- కుప్పం ప్రాంతం లో అధిక శాతం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు

- కుప్పంలో పేదరికాన్ని రూపు మాపడమే ముఖ్యమంత్రి లక్ష్యం

- మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యo వచ్చిన నాడే వారి కుటుంబం తద్వారా సమాజం బాగుపడుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి 

- జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సంఘం ఆధ్వర్యంలో పిఎంఎజెఏవై పథకం క్రింద రైతులకు టార్పాలిన్, డమ్స్ పంపిణీ 
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
మన రాష్ట్రం లో అధిక శాతం రైతులు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం) చేస్తున్నారని ఈ విధానం ఇతరరాష్ట్రాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సంఘం ఆధ్వర్యంలో పిఎంఎజెఏవై పథకం క్రింద ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎస్ సి రైతులకు వంద శాతం రాయితీ పై 18×24 అడుగుల టార్పాలిన్ లు,ప్లాస్టిక్ డ్రమ్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్, ముఖ్య అతిధులుగా విచ్చేయగా.. జె సి పి.శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, మహిళా రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎంఏజెఏవై కింద జిల్లాలో 1,205 మంది రైతులు లబ్ధిదారులుగా ఎంపిక కాగా కుప్పం నియోజకవర్గంలో 518 మంది రైతులు ఎంపికయ్యారని, ఇందులో రూ.5వేలు విలువైన 2 టార్పాలిన్ లు, రూ.1,830 విలువైన 200 లీటర్ల డ్రమ్ ఒకటి, రూ.1,020 విలువైన డ్రమ్ ఒకటి జిల్లా కలెక్టర్, ఎం ఎల్ సి,జెసి చేతుల మీదుగా మహిళా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం లో చాలా గ్రామాలలో యంత్రాలు, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. వీరు ఆవు పేడ, గోమూత్రం, ఇతర ప్రకృతి సంభంధమైన ఎరువులను తయారు చేసుకుని సేంద్రీయ విధానంలో పంటలు పండిస్తున్నారన్నారు. ఈ పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, జీవన విధానం ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు వచ్చే చిన్నపాటి సమస్యలను అవగాహన ద్వారా అధిగమించి కొనసాగించాలని, తోటి రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ తరహా విధానం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన సహాయం జిల్లా యంత్రాంగం అందిస్తుందన్నారు. 
     ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం లో పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం గా చేసుకున్నారన్నారు. కుప్పం అభివృద్ధి కి గతంలో చేసిన హామీల అమలుకు సంబంధించి కొన్నింటికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రావడానికి ముందే ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మరికొన్నింటి అమలుకు కార్యాచరణ ప్రణాళికను, అంచనా వ్యయాలను సిద్ధం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత 30 సం.రాలలో కుప్పంలో జరిగిన అభివృద్ధి కి మించి రానున్న ఐదేళ్లలో కుప్పం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. 2014 సం. లో మహారాష్ట్ర కు చెందిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని మనకు పరిచయం చేశారని, ఈ విధానం ద్వారా హానికర ఎరువులు మందుల వాడకం లేకుండానే సేంద్రీయ వ్యవసాయం సాధ్యమవుతుందన్నారు. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ మన రాష్ట్రాన్ని దత్తత తీసుకునేలా చేసి వివిధ ప్రాంతాలలో చాలా మంది రైతులకు శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఈ శిక్షణలో భాగంగా రైతులకు జీవామృతం,వేప పిండి తయారీ విధానాలను నేర్పారన్నారు. తద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిన రోజున వారి కుటుంబం తద్వారా సమాజం బాగుంటుందని ముఖ్యమంత్రి బలంగా నమ్ముతారని,డ్వాక్రా సంఘాల ఏర్పాటు, సూపర్ సిక్స్ లో మహా శక్తి పథకం తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా రైతులు విజయలక్ష్మి, నాగ భూషణమ్మ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట సాగు చేయడం వల్ల కలుగు లాభాలను దిగుబడి వివరాలను వారు పొందిన ప్రయోజనాలను కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమం లో డిపిఎం వాసు, ఎస్ సి కార్పొరేషన్ ఇన్చార్జి ఈడి రాజ్యలక్ష్మి, నాయకులు, డా.సురేష్ బాబు, ప్రవీణ్ కుమార్ లు, మహిళా రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post