పోలీసులకు షాకింగ్.. ముచ్చుమర్రి హత్యాచారం కేసులో ఇన్వెస్టిగేషన్ టీమ్ కు గట్టి దెబ్బ..!
నంద్యాల, త్రిశూల్ న్యూస్ :
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ముచ్చెమటలు పట్టే పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులోని ఓ అనుమానితుడు పోలీసు స్టేషన్ లోనే మృతి చెందాడు. ఈ స్థితిలో పోలీసుల మెడకు లాకప్ డెత్ ఉచ్చు బిగిసింది. అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంతో చనిపోయాడా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అనుమానితుడి మరణం మాత్రం లాకప్ డెత్ కేసుగా మారటం ఖాయమని పోలీసుల్లో అలజడి రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యులను మూడు రోజుల కిందట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఇక బాలిక మృతదేహం జాడ కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుల్లో ఒకరి మేనమామ హుస్సేన్ అలియాస్ యోహనయ్య ను క్రైమ్ టీమ్ అదుపులోకి తీసుకుంది. మిడుతూరు పోలీసు స్టేషన్ కు తరలించింది. మూడు రోజులుగా ఆ స్టేషన్ లోనే క్రైమ్ బృందం విచారిస్తోంది. శనివారం తెల్లవారుజామున మిణుతూరు పోలీసు స్టేషన్ లో చనిపోయాడు. విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖంపైన, శరీరంపైనా గాయాలు ఉన్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్ లో నిందితుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment