Trishul News

గ్రామాలు,పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలి - చిత్తూరు కలెక్టర్

- ఈఓపిఆర్డి లు రోజుకు రెండు పంచాయతీలు విధిగా పరిశీలించాలి

- సీజనల్ వ్యాధులు కట్టడికి వైద్య ఆరోగ్య శాఖతో పంచాయతీ శాఖ అధికారులు సమన్వయం

- సచివాలయ ఉద్యోగుల హాజరు, సమయపాలనపై ఎంపిడిఓలు పర్యవేక్షణ చేయండి
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలనలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, అక్రమ లే అవుట్ ల కట్టడి, పన్నుల వసూలు, సచివాలయ సిబ్బంది హాజరు తదితర అంశాల పై ఎంపిడిఓలు, ఈఓ పిఆర్డిలు మరింత బాధ్యతగా తమ విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లు, ఈఓపిఆర్డిలు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి అధికారులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దీనితో పాటు సురక్షితమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, డయేరియా, చికున్ గున్యా, తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కలుషిత త్రాగు నీరే వీటన్నిటికీ ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పని చేయాలని సూచించారు. పంచాయతీ పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అందుబాటులో ఉన్న నిధుల నుండి జీతాలు చెల్లించాలని, ఈ విషయంలో సర్పంచ్ లతో పంచాయతీ సెక్రెటరీ లు సమన్వయం చేసుకుని జీతాల ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డీ లు విధిగా గ్రామాలలో పర్యటించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పై ఒక అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. పంచాయతీ సెక్రెటరీలు మున్సిపాలిటీ తరహాలో గ్రామాలలో కూడా ఉదయమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, దీనితో పాటు గ్రామాలలో మరియు సంక్షేమ హాస్టల్ లలోని వాటర్ ట్యాంక్ లను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలని, పైప్ లైన్ లీకేజిల పై చర్యలు తీసుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధులను కొంత వరకు కట్టడి చేయవచ్చునన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు నమోదైన వెంటనే మండల, గ్రామ స్థాయిలోని అధికారులు అప్రమత్తమై కట్టడికి చర్యలు చేపట్టడం ద్వారా ఆ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్థానికంగా ఉన్న ఆరోగ్య సిబ్బందితో ఫీవర్ సర్వేకి సంబంధించి వివరాలను తెలుసుకుని మండల స్థాయిలో సర్వసభ్య సమావేశంలో ఈ అంశాల పై ఎంపిడిఓ లు ప్రజా ప్రతినిధులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టడం ద్వారా వ్యాధులను కట్టడి చేయవచ్చునని సూచించారు. దీనితో పాటు సకాలంలో పంచాయతీలలో పన్నుల వసూళ్ల ద్వారా పంచాయతీల ఆదాయం పెంపునకు కృషి చేయాలని, అక్రమ లే అవుట్ లను కట్టడి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ వ్యవస్థలో పని చేసే సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, సమయపాలన ను ప్రతి రోజూ పర్యవేక్షించాలని, సచివాలయానికి వచ్చే అర్జీల నమోదు సంబంధించి రికార్డులను సంబంధిత రిజిష్టర్ ల నిర్వహణను కూడా ఎంపిడిఓ లు వారి తనిఖీలో పరిశీలించాలన్నారు. ప్రతి మండల పరిధిలో ఎంపిడిఓ లు సచివాలయాల వారీగా అసంపూర్తిగా ఉన్న అన్ని రికార్డులను ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ గ్లోరియా, డిపిఓ లక్ష్మీ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ విజయ్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ డా. ప్రభావతీ దేవి, మున్సిపల్ కమిషనర్ లు, ఎం పి డి లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post