Trishul News

పరిశ్రమల అభివృద్ధికి సంపూర్ణ సహకారం - తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 84 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, స్కిల్ల్డ్ మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం రామతులసి కల్యాణమండపంలో ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల ఎంఎస్ఎంఇ గ్రాంట్స్ ఉన్నాయని కానీ ఆ నిధులను ఒక ఆర్గనైజేషన్ మినహా మిగిలిన 29 ఆర్గనైజేషన్లు ఉపయోగించుకొన్నట్లు లేదని అన్నారు. ఆ ఒక్క ఆర్గనైజేషన్ మాత్రమే 25 కోట్ల రూపాయల నిధులను వినియోగించుకొన్నదని తెలియజేసారు. మిగిలిన ఆర్గనైజేషన్లు కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తిరుపతి ఛాంబర్ అఫ్ కామర్స్ వారు చొరవ తీసుకొని ముందుకు వస్తే తన వంతు సహకారం అందింస్తానని తెలియజేసారు. కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కోసం ఇచ్చే నిధులకి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తుందని కానీ వీటిని వినియోగించుకోవడం లేదని అన్నారు. అందరికి సౌలభ్యంగా ఉండే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ప్రస్తుతం వైజాగ్ లో మాత్రమే ఉన్నటువంటి ఎంఎస్ఎంఇ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని త్వరలోనే తిరుపతిలో ఆ కార్యాలయం ఏర్పాటు అవుతుందని తెలియజేసారు. మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నపుడే ఆ ప్రాంతాలలో కొత్త పరిశ్రమలు వస్తాయని, వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో 742 కిలోమీటర్ల పరిధిలో జాతీయ రహదారులు అభివృద్ధి చేసేందుకు వివిధ ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారని త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కూడా 300 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని రైల్వే కనెక్టివిటీ కూడా పెరుగుతుందని అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ కూడా 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నారని త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలియజేసారు. చెన్నై, వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ మరియు చెన్నై, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కి దగ్గరగా ఉండటం తిరుపతి పార్లమెంటుకి కలసి వచ్చే అంశమని అన్నారు. గత 5 సంవత్సరాలలో దాదాపుగా 27803 కోట్ల రూపాయలతో 65 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని వాటి ద్వారా 43213 మందికి ఉపాధి లభించిందని అన్నారు. ప్రముఖ దేవాలయాలు ఉన్న మన ప్రాంతంలో ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేసుకొనే విధంగా అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆలయాలకు అవసరమైన వస్తువులను ఎంఎస్ఎంఇ ద్వారా పరిశ్రమలను ప్రారంభించి మన ప్రాంతంలోనే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా ముందుకు వెళ్లాలని కోరారు. తిరుపతి నగరంలో ఆతిధ్య రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేరెన్నిక కలిగిన పెద్ద హోటల్స్ తో కలిసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతి పట్టణంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా స్విమ్స్ ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ గుర్తించాలని కోరడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఇ లు ప్రోత్సహిస్తేనే ఈ మ్యాన్ పవర్ తిరుపతిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయని చెప్పారు. తిరుపతిలో ఎంఎస్ఎంఇల నిర్మాణానికి 238 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్తున్నారని కానీ 500 ఎకరాలలో యూనివర్సిటీ నిర్మిస్తేనే ఎంఎస్ఎంఇ లకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందుకోసం తాను కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు. వారికి రావలసిన ప్రయోజనాలు అందేలా తాను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని వాటి గురించి తాను పార్లమెంటులోనూ సంబంధిత సెక్రటరీలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Post a Comment

Previous Post Next Post