Trishul News

పట్టణాలకు తరలుతున్నారు.. తెలంగాణలో ఊర్లు ఖాళీ..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
పల్లెటూరు అంటేనే పచ్చని చెట్లు.. పచ్చని పొలాలు కనిపిస్తుంటాయి. వాటికితోడు పిల్ల, పెద్ద కాలువలు, కాలువ గట్లు కనిస్తాయి. పలురకాల తోటలు, చల్లటి పైరగాలి, పెద్ద పెద్ద పెంకుటిళ్లు ఇలా బాపుగారి బొమ్మలా గ్రామాలు పలకరిస్తుంటాయి. పల్లెలు అంటేనే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలూ అలానే ఉంటాయి. సాయం చేయడంలోనూ ఒకరకంటే ఒకరు ముందుకు వస్తుంటారనేది చెప్పుకుంటుంటం. బంగారం పండించే రైతులకూ పల్లెలే అడ్డా. అలాంటి పల్లెటూరిలో ఉపాధి దొరికే మార్గం లేక ప్రజలు పట్నం బాటపడుతున్నారు. పట్నం వస్తే ఏదో ఒకటి చేసుకొని బతకవచ్చని పట్టణాలకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో జనాభా రోజురోజుకూ తగ్గుతోంది. తాజాగా.. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పల్లెల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లోని ప్రజలు కొందరు ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పడుతుండగా.. మరికొందరు తమ పిల్లల చదువుల కోసం అంటూ వసల వెళ్తున్నారు. ఆ సంఖ్య ఒకప్పుడు వందల్లో ఉంటే ఇప్పుడు లక్షలకు చేరుకుంది. గ్రామాల్లో ఉండలేక.. వీడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ 'హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23'ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 23 మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా -7.84శాతం తగ్గింది. పట్టణ జనాభా 34.05 శాతం పెరిగిందని వెల్లడించింది. జూలై 1, 2023 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జనసాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ 14,491తో టాప్‌లో ఉండగా.. తెలంగాణ 386తో 18వ స్థానంలో ఉందని వివరించింది. అదే పట్టణాలకు వచ్చే సరికి 4,885, గ్రామాలలో 210 ఉందని పేర్కొంది.

Post a Comment

Previous Post Next Post