తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఈ యేడాది లేనట్లే..?
- బీసీ గణనకు మూడు నెలల గడువు కోరిన ప్రభుత్వం
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
ఎన్నికల నిర్వహణకు కీలకమైన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును మూడు నెలల సమయం అడిగింది. దీంతో ఈ యేడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లేనని స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావని 'నమస్తే తెలంగాణ' ఈనెల 2వ తేదీన కథనం ప్రచురించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ట్రిపుల్ టెస్ట్ ద్వారా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. దీని కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ బాధ్యతను బీసీ కమిషన్‌కే అప్పగించింది. అయితే ఈ కమిషన్ గడువు ముగియడంతో కొత్త కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసి, అవగాహనకు వచ్చి తదుపరి కార్యాచరణను ఖరారు చేయాల్సి ఉంది. ఈ తతంగమంతా పూర్తి చేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపినట్టు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. మధ్యలో ఎలాంటి అటంకాలు లేకుండా, వరదలు, విపత్తులు, అనుకొని సంఘటనలు ఏమైనా జరిగితే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
42 శాతం సాధ్యమయ్యేనా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమయంలో జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ ప్రకటన చేశారు. అప్పట్లోనే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం కాంగ్రెస్ క్యాడర్‌లో ఆశలు కల్పించడానికి, వారు ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయించడం కోసమే అలాంటి ప్రకటనలు చేశారని విశ్లేషకులు అంచనా వేశారు. అదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలు అంటూ ప్రకటనలు చేస్తూ, లీకులు ఇచ్చారని పార్టీలు విమర్శించాయి. ఎన్నికల పూర్తి ప్రక్రియను ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించలేదు. కీలకమైన బీసీ రిజర్వేషన్లపై ఇంకా స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం తీసుకోలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై సీఎం రేవంత్ చేతులు ఎత్తేశారని విమర్శిస్తున్నాయి. బీసీలకు 24 శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని, మిగిలిన 18 శాతాన్ని రాజకీయ పార్టీలుగా టిక్కెట్లు ఇద్దామంటూ కొత్త ప్రతిపాదనను తీసుకవచ్చారని మండిపడుతున్నాయి. జనరల్ సీట్లలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా ఇతర పార్టీలు ఓసీ అభ్యర్థులను నిలిపితే బీసీల గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Post a Comment