తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
దేశంలో ఓటు చోరీకి పాల్పడున్న ఎన్నికల కమిషన్, బీజేపీ తీరును ఎండగడుతూ ఈనెల 20వ తేదీన తిరుపతిలో చేపడుతున్న ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమంమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు అధ్యక్షతన తిరుపతి జిల్లా ముఖ్య నేతల సమావేశం మంగళవారం గెస్ట్ లైన్ డేస్ హోటల్ రోడ్డులోని కన్వెన్షన్ హాల్లో జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కమిటీ సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకు దిగజారిపోతోందని అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చట్ట, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహూల్ గాంధీ అటు పార్లమెంట్ లోను ఇటు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 20వ తేదీన తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఐసిసి, పీసీసీ పిలుపుమేరకు చేపడుతున్న సంతకాల సేకరణకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరై సంతకాలు చేసి ఓట్లు చోరీకి వ్యతిరేకంగా నినదించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనబంధ సంఘాల నాయకులు అందరూ సైనికుల్లా కదలి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు బీజేపీ, ఈసీ కారణమని ఆరోపించారు. అధికారంలో కొనసాగడానికి బీజేపీ ఇంతటి దారుణ చర్యలకు పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈనెల 20న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి రావడానికి బీజేపీ అడ్డమైన విధానాలు అనుసరిస్తోందని ఇందులో భాగంగానే ఓట్లు చోరీకి తెరలేపిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాలు బయటపగట్టడంతో ఆపార్టీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదన్నారు. దేశభక్తి పార్టీ అని చెప్పుకుంటూ మరోవైపు తమ మనుధర్మ శాస్త్ర అమలుకు ఆరెస్సెస్ తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వం లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీలేని పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళీకృష్ణ, పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్ లు మాట్లాడుతూ నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అలాంటి పార్టీపై బురదజల్లడానికి బీజేపీ ఆరెస్సెస్ కలిసి కుట్రపన్నుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు. రాహుల్ గాంధీని నిర్భందించడానికి, భయపెట్టడానికి బీజేపీ చేస్తున్న ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు, పిసిసి ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఏఐసిసి ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళీకృష్ణ, మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, కాళహస్తి నియోజకవర్గం సమన్వయకర్త తలపామోదర్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త వెంకటాచలపతి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాల్లా రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు శివశంకర్, డిసిసి ప్రధాన కార్యదర్శి కళిందర్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ముషీనా బేగం, తిరుపతి సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలారి గోపీచంద్, ఉపాధ్యక్షులు గొడుగు చింత గోపి, నాగరాజు యాదవ్, ఆర్గనైజేషన్ సెక్రెటరీ పవన్ కళ్యాణ్, తిరుపతి జిల్లా ఎస్ టి విభాగం అధ్యక్షులు జ్యోతిశ్వర నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోయన నరేంద్రబాబు, పిసిసి మాజీ బీసీ సెల్ కార్యదర్శి బయలు గోపి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment