మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మార్చడం దుర్మార్గం - కాంగ్రెస్ - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 19, 2025

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మార్చడం దుర్మార్గం - కాంగ్రెస్

- మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన

- దేశంలో గాంధీ, అంబేడ్కర్ పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోంది

- తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టి బాబు ధ్వజం
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
అధికార బలంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లను కనపడనీయకుండా చేయడానికి కుట్రలు చేస్తోందని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును బిజెపి ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని బిజెపి అప్రజాస్వామిక పాలన చూడలేక పోతున్నామంటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి గౌడ పేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం -2005 (NREGA) పేరుతో ప్రారంభించారని తెలిపారు. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీసవేతనం  వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడిందని అన్నారు. ప్రధాని మోడీకి కాంగ్రెస్ మీద కోపమా లేక మహాత్మా గాంధీ మీద కోపమా తెలియడం లేదని హఠాత్తుగా ఈ చట్టానికి గాంధీ పేరుని తొలగించి రాముడు పేరు వచ్చేలా పేరు మార్చడం ఏమాత్రం సమర్ధనీయం కాదన్నారు. ఇది దేశద్రోహమని మండిపడ్డారు. భవిష్యత్తులో భారత కరన్సీపై ఉన్న మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలగించి తన చిత్రాన్ని లేదా గాడ్సే చిత్రాన్ని పెట్టేలా మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును VB-G RAM-G (Viksit Bharat—Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin))గా మార్చేందుకు పార్లమెంటులో బిల్లును తన బలంతో ఆమోదముద్ర వేయించుకుని క్షమించరాని తప్ప చేసిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రచారం కోసం ప్రజా ధనాన్ని పేరు మార్చే రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రతి పేరు మార్పు వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుందని తెలిసినా కేంద్ర ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడుతోందని ఇప్పటికైనా తన తీరు మార్చుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డుల నుంచి డిజిటల్ సిస్టమ్‌ల వరకు, గ్రామ గోడల నుంచి టీవీ ప్రకటనల వరకు ప్రతి చోట ప్రజా ధనంపై భారీ భారం పడుతుందని చెప్పారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ MGNREGA అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా, ఉపాధి హామీ పథకం అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఇది అమలులో ఉందని ఇప్పటి వరకు సుమారు 250 మిలియన్ల మంది కార్మికులు ఈ పథకంలో నమోదు కాగా, వారిలో 143.3 మిలియన్ల మంది నిరంతరం పనిచేస్తున్న క్రియాశీల లబ్ధిదారులని తెలియజేశారు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల గ్రామ పంచాయతీలు, 7,000కు పైగా బ్లాక్‌లు, 700కు పైగా జిల్లాల వరకు ఈ పథకం విస్తరించి ఉందని, ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న మార్పు కూడా కోట్ల రూపాయల ఖర్చుకు దారి తీస్తుందని వివరించారు. దీనిని మార్చడం పూర్తిగా అప్రజాస్వామిక చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ MGNREGAలో ప్రతి కార్మికుడికి ఒక జాబ్ కార్డు ఉంటుందని ప్రస్తుతం ఈ కార్డుపై “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం” పేరు, గాంధీజీ కళ్లజోడు లోగో ముద్రించబడి ఉంటుందని ఈ పేరు మారితే, సాంకేతికంగా ఈ కోట్లాది జాబ్ కార్డులు పనికిరానివిగా మారతాయని అన్నారు. ఒక్కో లామినేటెడ్ జాబ్ కార్డు ముద్రణ, పంపిణీ ఖర్చు కనీసం రూ.15గా లెక్కించినా, 250 మిలియన్ కార్డుల కోసం దాదాపు 375 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్త కార్డులు ముద్రించకుండా, పాత కార్డులపై స్టిక్కర్లు అతికించాలన్నా, ఆ స్టిక్కర్ల ముద్రణ, పంపిణీ, అతికింపు వంటి పరిపాలనా ఖర్చులు కూడా వందల కోట్లలోనే ఉంటుందన్నారు. ఇది ప్రభుత్వ ఖజానా పై భారీగా భారం పడుతుందన్నారు. వెంటనే పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 2.69 లక్షల గ్రామ పంచాయతీల్లోని లక్షలాది గోడలపై మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుందని ఒక్క గోడకు కనీసం రూ.1,000 ఖర్చయినా, మొత్తం వ్యయం సుమారు 200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే రబ్బరు స్టాంపులు, లెటర్‌హెడ్‌లు, మస్టర్ రోల్స్, రిజిస్టర్లు, ఫైల్ కవర్లు, దరఖాస్తు ఫారమ్‌లు అన్నీ కొత్త పేరుతో మళ్లీ ముద్రించాల్సి ఉంటుందని ఒక్కో కార్యాలయానికి ఇది చిన్న ఖర్చులా కనిపించినా, 700 జిల్లాలు, 7,000 బ్లాక్‌లు, లక్షలాది కార్యాలయాలను కలిపి లెక్కిస్తే, ఇది భారీ మొత్తంగా మారుతుందని తెలిపారు. పాత పేరుతో ముద్రించిన స్టేషనరీ మొత్తం వృథా అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర ఉపాధ్యక్షుడు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శులు మహేష్, ఆమూరి కృష్ణమూర్తి, పాల మండల శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తవన్ కళ్యాణ్, కార్యదర్శి కాల్వ వినోద్ కుమార్, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జ్యోతీశ్వర్ నాయక్, బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు చిరంజీవి, ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు శోభరాజ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages