- తెలంగాణలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి - తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి పర్యటనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి లు తిరుపతి నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ నందు ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు సర్పంచ్ల సంఘం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా పంపిన నిధులు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సర్పంచుల ఖాతాలో జమ చేయకుండా సుమారు 8669 కోట్ల రూపాయలు దొంగిలించి దారి మళ్లించి పంచాయతీలను మరియు సర్పంచులను బ్రష్టు పట్టించారని రాజేంద్రప్రసాద్ గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాడుకున్న 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులు 1000 కోట్ల రూపాయలు సర్పంచుల ఖాతాలో జమ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి రాజేంద్రప్రసాద్ అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా కేంద్రం పంపిన 991 కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం మాదిరిగా దారి మళ్లించకుండా సర్పంచుల ఖాతాలో జమ చేసి మా పోరాటాన్ని, ఉద్యమాన్ని మాకు ఇచ్చిన మాటను గౌరవించిందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. 2024- 25 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులు 1121 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి సర్పంచుల ఖాతాలో జమ చేయాలని, అంతేకాకుండా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పీటీసీల, ఎంపీపీల మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ల గౌరవ వేతనం కూడా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని అందుకు వారు స్పందిస్తూ సెప్టెంబర్ నెలలో 15వ ఆర్థిక సంఘం నిధులు 1121కోట్లు సర్పంచ్ల ఖాతాలో జమ చేస్తామని , గౌరవ వేతనము త్వరలో పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. అందుకని రాష్ట్రంలోని సర్పంచులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎట్టి పరిస్థితుల్లో నిధులు విడుదల చేసేవరకు పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం కృషి చేస్తుందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా సుమారు 4600 కోట్ల రూపాయలతో గ్రామాలలో రోడ్లు మరియు డ్రైనేజీ వేసినందుకు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.
తెలంగాణలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఎన్నికలు జరపలేదని, ఎన్నికలు జరుపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని కావున వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చింపుల సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పుసులూరు నరేంద్ర , ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య , ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి, చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్ , అనిల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment