Trishul News

కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన​ రెడ్డి.. గోలీల ఆటకు, రాజకీయాలకు పోలిక..!

బెంగళూరు, త్రిశూల్ న్యూస్ :
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ' ద్వారా రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ' పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆయన వెల్లడించారు.

గోలీల ఆట.. రాజకీయం..
భాజపాతో తన బంధంపై స్పష్టత ఇచ్చారు గాలి జనార్దన రెడ్డి. "నేను భాజపాలో సభ్యుడ్ని కాదు. అయినా చాలా మంది నేను ఆ పార్టీకి చెందిన వాడినే అనుకుంటున్నారు. ఆ ప్రచారానికి నేను ఈరోజు తెర దించుతున్నా. భాజపాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పేరుతో, నా ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీ ప్రారంభిస్తున్నా. ప్రతి పల్లెకు, గడప గడపకూ వెళ్తా. నేను (చిన్నప్పుడు) గోలీల ఆటలోనే ఓటమిని అంగీకరించలేదు. అలాంటప్పుడు రాజకీయాల్లో నేనెలా ఓటమిని అంగీకరిస్తా? నాకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుంది." అని చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి.

12ఏళ్ల వనవాసం..
ఓబుళాపురం మైనింగ్​ కంపెనీకి సంబంధించిన కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని అన్నారు గాలి. బళ్లారికి వెళ్లేందుకు కోర్టు అనుమతించినా.. తనను అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే.. అండగా ఉంటామని శ్రేయోభిలాషులు, బళ్లారి ప్రజలు మాట ఇచ్చారని.. అందుకే రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు జనార్దన రెడ్డి.

గాలి పార్టీలోకి శ్రీరాములు వస్తారా..?
భాజపా సీనియర్ నేత యడియూరప్ప అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పారు గాలి. ఆయనపై ఇప్పటికీ ప్రేమ, నమ్మకం అలానే ఉన్నాయని చెప్పారు. అయితే.. కొత్త పార్టీ ఏర్పాటుపై యడియూరప్పతో చర్చించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్న శ్రీరాములు, ఆయన సోదరుల్ని భాజపా వీడి తన పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేయనన్నారు గాలి జనార్దన్ రెడ్డి.

Post a Comment

Previous Post Next Post