Trishul News

వచ్చేనెల పెళ్లి.. ఇంతలోనే మృత్యువు ఒడిలోకి టిటిడి ఈఓ కుమారుడు..!

- గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి


తిరుపతి, త్రిశూల్ న్యూస్ :

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట ఊహించని విషాదం కన్నీరు పెట్టేలా చేస్తోంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన పెళ్ళికొడుకు గుండెపోటుకు గురై మృతి చెందాడు. పెళ్లి సందడితో సదరగా ఉండాల్సిన ఇళ్లు శోక సంద్రంగా మారింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన చివరకు తుది శ్వాస విడిచారు. చంద్రమౌళి అలియాస్ శివ గుండెపోటుతో చెన్నైలోనే కావేరి ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే చేరినప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన్ను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం మిగిల్చారు.  చంద్రమౌళి వయసు కేవలం 28 సంవత్సరాలే.. ఇటీవలే ఆయనకు చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెల వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు శుభలేఖలను పంచుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి నిన్న మధ్యాహ్నం ఆయన కారులో వెళ్లారు. కాసేపటి తర్వాత గుండెలో నొప్పిగా ఉందని కారులోనే ఉన్న స్నేహితుడితో ఆయన చెప్పారు. దీంతో, ఆయనను నేరుగా కావేరి ఆసుపత్రికి తరలించారు. చంద్రమౌళి ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతోపాటు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్ర ప్రయాత్నాలు చేశారు. అక్కడ ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఇటు ధర్మారెడ్డి కుటుంబంలో అటు ఏజే శేఖర్ రెడ్డి కుటుంబంలోనూ విషాదం నెలకొంది..  బిడ్డను ఉన్నత శిఖరాల్లో చూడాలని ఆశించిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇంత చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడానికి రెండు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధికారులు, సభ్యులు అంతా ఈ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post